మెరుగైన కంటిచూపుకి.....


వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, టీవీ సీరియల్స్, బుక్ రీడింగ్ ఒకటేమిటి అన్నిటినీ ఆస్వాదిస్తూ మన కళ్ళకి పని చెప్పి వాటిని అలిసిపోయేలా చేస్తున్నాం. దాని ఫలితమే చిన్నపిల్లలకి కూడా ఈ రోజుల్లో కళ్ళద్దాలు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్ళు మూసుకుని ఒక పావుగంట ఉండమంటే చాలు ప్రాణం పోయినంత పని అవుతుంది.

అలాంటి  కళ్ళని జాగ్రత్తగా చూసుకోవటానికి మనం తీసుకోవలసిన కొన్ని ఆహారపదార్థాల మీద దృష్టి పెడితే చాలు, కంటి చూపు మెరుగుపడి మీకు ఎంత వయసు పైబడ్డా కళ్ళద్దాలే అవసరం లేకుండా హాయిగా ఉండచ్చు. కేరెట్ కళ్ళకి మంచిదన్న సంగతి అందరికి తెలిసిందే. దీనిలో ఉండే బీటా కరోటిన్ కంటిలోని కణాలు ఆరోగ్యంగా పెరగటానికి దోహదపడుతుంది.రేచీకటి కూడా రాకుండా కాపాడుతుంది. వారంలో రెండు సార్లయినా పిల్లలు కేరట్ జ్యూస్ తాగేలా చూసుకుంటే చాలు.

 

 

సిట్రస్ ఫ్రూట్స్ - ఈ నిమ్మ జాతికి చెందిన పళ్ళల్లో విటమిన్ సి హెచ్చు మోతాదులో ఉండటం వల్ల కళ్ళకి కేటరాక్ట్ రాకుండా రక్షణ కవచంలా ఉంటుంది. క్రమం తప్పకుండా ఏదో ఒక పండు తినటం అలవాటు చేసుకోవటం మంచిది.

వాల్నట్స్ - వీటిలో అధికంగా ఉండే ఒమేగా 3 ఆమ్లాలు కంటిని పూర్తీ స్థాయిలో కాపాడతాయి. అలాగే బాదం, పిస్తాలు, జీడిపప్పులలో కూడా విటమిన్ ఈ ఎక్కువగా ఉండటం వలన  మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

చిరు ధాన్యాలు - చాలా మందికి  ఈ చిరుధాన్యాలంటే చిన్నచూపు ఎక్కువ. కాని వీటిలో నిక్షిప్తమై ఉన్న జింక్ కంటి రెటీనాని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. రెటీనాకి బలాన్నిస్తుంది.

చిలకడదుంప - చిలకడదుంపలని ఈ మద్య కాలంలో ఎక్కువగా ఎవరి తినటం లేదు.కాని ఇవి కళ్ళకిఎంతో మేలు చేస్తాయి. కేరట్ లో ఉన్నన్ని గుణాలు ఈ దుంపల్లో కూడా ఉన్నాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఈ చిలకడ దుంపలు తినటం వల్ల కంటిచూపు బాగుంటుంది.

వీటితో పాటు రెగ్యులర్ గా ఆకుకూరలు, సాల్మన్ చేపలు, స్ట్రాబెర్రీ, గుమ్మడికాయ మొదలైన వాటిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మన కంటి చూపు గురించి ఇక ఆలోచించాల్సిన పనే లేదు.


తగిన పౌష్టిక ఆహారంతో పాటు కళ్ళకి తగినంత విశ్రాంతిని కూడా ఇస్తూ ఉండాలి. ఏకదాటిగా ఒకే వైపు చోస్తూ ఉన్నట్లయితే కళ్ళు ఎక్కువగా అలసిపోతాయి. ఏదైనా పని చేస్తూ మద్యలో కళ్ళని ఆర్పుతూ ఉండాలి. కంటికి చిన్న పాటి ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండాలి. రెండు చేతులని గట్టిగా రుద్ది వాటిని కళ్ళపై పెడుతూ ఉన్నా కళ్ళకి మంచిదే. అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకి వెళ్ళాల్సి వస్తే తప్పనిసరిగా సన్ గ్లాసెస్ పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. బయట నుంచి ఇంటికి రాగానే చల్లనీళ్ళని కళ్ళపై చల్లుకోవాలి.  ఇలా కాస్తంత శ్రద్ద పెడితే చాలు కలువల్లాంటి కళ్ళను చక్కగా కాపాడుకోవచ్చు.

..కళ్యాణి