టీఆర్ఎస్ అభ్యర్థిగా పీవీ కూతురు!
posted on Feb 21, 2021 @ 7:37PM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానం నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయించిన గులాబీ బాస్.. అభ్యర్థి ఎంపికలో విపక్షాలకు షాకిచ్చారు. టీఆర్‌ఎస్ పట్టభద్రుల అభ్యర్థిగా సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. వాణీదేవి దివంగత మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె. వాణీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావునే తిరిగి బరిలోకి దింపింది. గతంలో ఇక్కడి నుంచి విజయం సాధించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోసారి బరిలోకి దిగారు. ఆయన వామపక్షాల మద్దతుతో పోటీ చేస్తున్నారు. నల్గొండకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించిన కేసీఆర్.. హైదరాబాద్ కు ప్రకటించలేదు. దీంతో ఇక్కడ పోటీ చేయకుండా... ప్రొఫెసర్ నాగేశ్వర్ కు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందనే ప్రచారం జరిగింది.
వాణీదేవిని అభ్యర్థిగా టీఆర్‌ఎస్ ప్రకటించడం వెనుక వ్యూహం ఉందని పలువురు చెబుతున్నారు. పి.వి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నుంచి అంచెలంచలుగా ఎదిగి దేశానికి ప్రధాని అయ్యారు. అలాంటి పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ దూరం చేసుకుంది కాబట్టి.. దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోందని తెలుస్తోంది.