సొంత పార్టీ శ్రేణులకే వెగటు పుట్టిస్తున్న జగన్ రెడ్డి అతితెలివి!

అంత నీతే వుంటే ఇంత సంతెందుకు? అని వైసీపీ శ్రేణులే జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం కన్నూ మిన్నూ కాననట్లుగా ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమే అధికారం అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా తానే ముఖ్యమంత్రి అన్న భ్రమల్లోనే గడుపుతూ క్యాడర్ ను కష్టాల పాలు చేస్తున్నారన్న చర్చ వైసీపీ నేతల్లోనే జరుగుతోంది.

వైసీపీ అధినేత‌, పులివెందులఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరులో ఏమాత్రం మార్పురావ‌డం లేదు. ఇంకా మేమే అధికారంలోనే ఉన్నాం.. తానే ముఖ్య‌మంత్రి  అన్న‌ట్లుగా ఆయ‌న‌ వ్య‌వ‌హిస్తుండ‌టం పట్ల వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. జ‌గ‌న్ మ‌నం దారుణంగా ఓడిపోయాం.. ఇప్ప‌టికైనా వాస్తవంలోకి రండి అంటూ వైసీపీ నేత‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. త‌న‌ను న‌మ్ముకున్న వైసీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా అరెస్ట్ అవుతుంటే.. జ‌గ‌న్ మాత్రం కూట‌మి ప్ర‌భుత్వాన్ని మ‌రింత రెచ్చ‌గొడుతూ ఇంకా అరెస్టు చేయం డి చూస్తా అంటూ స‌వాల్ చేస్తుండ‌టంతో వైసీపీ నేత‌ల ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటున్నది. జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌తో విసిగిపోయిన ఏపీ ప్ర‌జ‌లు.. ఎన్నిక‌ల్లో వైసీపీకి కేవ‌లం ప‌ద‌కొండు సీట్లు మాత్ర‌మే ఇచ్చారు. దీంతో ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా చేశారు.

నిజంగా ప్ర‌జ‌ల‌కోసం పోరాడే మ‌న‌స్త‌త్వ‌మే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఉండిఉంటే అసెంబ్లీకి వెళ్లి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడాలి. కానీ, జ‌గ‌న్  మాత్రం.. నాకు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వండి అప్పుడే అసెంబ్లీకి వ‌స్తా అంటూ మారం చేయ‌డం చూసి వైసీపీ శ్రేణులే జ‌గ‌న్ తీరు ప‌ట్ల‌ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అసెంబ్లీకి వెళ్లి ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడారు. కానీ, జ‌గ‌న్ మాత్రం అసెంబ్లీకి వెళ్లే సాహసం చేయ‌కపోవడం ఆయ‌న పిరికిత‌నాన్ని ఆయనే స్వయంగా బ‌హిర్గ‌తం చేసుకున్న‌ట్ల‌యింది. తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై జ‌గ‌న్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి పొంత‌న‌లేని వ్యాఖ్య‌లు చేసి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో ఏపీ శ్రీలంకలా మారు తోందంటూ  కూటమి నేతలు ప్రచారం చేశారన్న వైఎస్ జగన్.. వైసీపీ హయాంలో ఏపీ అప్పులపై గోబెల్స్ ప్రచారం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్‌తోనూ అబద్ధాలు చెప్పించార‌ని,  సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టేందుకే ఈ ప్రచారం చేశారన్నారు.  తెలుగుదేశం హయాంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 19 శాతం పెరిగితే,  వైసీపీ పాలనలో 15 శాతం మాత్రమే పెరిగాయని చెబుతూ తన ఐదేళ్ల పాలనలో చేసిన  త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌న ఐదేళ్ల పాల‌న‌లో స‌చివాల‌యాన్ని సైతం అప్పుల కోసం తాక‌ట్టు పెట్టిన విష‌యాన్ని జ‌గ‌న్ మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. అయితే, జ‌గ‌న్ ఏపీలో పెట్టుబ‌డుల విష‌యంపై మాట్లాడుతూ, కూట‌మి ప్ర‌భుత్వంలో ఏపీకి వ‌స్తున్న పెట్టుబ‌డుల‌న్నీ వైసీపీ హ‌యాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న‌వే అంటూ  ఎలాంటి బిడియం లేకుండా చెప్పుకున్నారు.  జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే.. ఏపీ ప్ర‌జ‌లు అమాయ‌కులు.. తాను ఏది చెప్పినా గుడ్డిగా న‌మ్మేస్తారని భావిస్తున్న‌ట్లుగా కనిపిస్తోంది. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో గ‌తంలో టీడీపీ హ‌యాంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టిన పెద్ద‌పెద్ద కంపెనీల‌ను వెళ్ల‌గ‌ట్టిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాని కొత్త‌గా చెప్పుకోద‌గ్గ ఒక్క కంపెనీ జ‌గ‌న్ హ‌యాంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌లేదు. ఇందుకు కూడా చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్  చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి.

జ‌గ‌న్ అబ‌ద్దాలు చెప్పి ప‌బ్బంగ‌డుపుకునేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదని వైసీపీ నేతలే ప్రైవేటు సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడితే నిజాలన్నింటినీ అక్కడిక్కడ బయట పెడతారన్న భయంతోనే జ‌గ‌న్ అసెంబ్లీకి డుమ్మా కొట్టి  మీడియా స‌మావేశం పెట్టి ఏక‌ప‌క్షంగా కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం చూస్తుంటే అస‌లు ఆయ‌న ఓ పార్టీకి అధ్య‌క్ష‌డా అనే సందేహాన్ని ఏపీ ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వంతో రిలయన్స్ చేసుకున్న ఎంవోయూలకు వైసీపీ హయాంలోనే  అడుగులు పడ్డాయని జగన్ చెబుతున్నారు.  దానికి సాక్ష్యం ఏమిటంటే.. అంబానీతో కలిసి జగన్ నవ్వుతూ నిల్చున్న ఫోటోనే అంటున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా  తనకు ఇషుమంతైనా సంబంధం లేని క్రెడిట్ ను క్లెయిమ్ చేసుకోవడమే కాకుండా.. ఆ ఫోటోలు ప్రదర్శించడం విస్తోపోయేలా చేస్తోంది.  

తన హయాంలోనే అంబానీ, అదానీ, టాటా, బిర్లాలు ఏపీకి వ‌చ్చార‌ని, ఎనిమిది కీలక ప్రాజెక్ట్‌లకు కీలక అడుగులు పడ్డాయ‌ని చెప్పుకొచ్చిన జ‌గ‌న్‌,  కూట‌మి ప్ర‌భుత్వంలోనే అన్ని తీసుకొచ్చినట్లు చంద్ర‌బాబు నాయుడు బిల్డప్‌ ఇచ్చుకుంటున్నారని  అన‌డం ప‌ట్ల వైసీపీ శ్రేణులు సైతం అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాయి. వైసీపీ హ‌యాంలో ఏపీ నుంచి  కంపెనీల‌ను వెళ్ల‌గొట్టి ఇప్పుడు ఇంత ప‌చ్చిగా అబ‌ద్దాలు ఎలా మాట్లాడుతున్నావ్‌ అన్నా అంటూ వైసీపీ నేత‌లే జ‌గ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్న పరిస్ధితి. ఐదేళ్లు అబ‌ద్దాల‌తో పాల‌న సాగించి కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితం అయ్యాం.. ఇంకా అబ‌ద్దాల‌తో నే పబ్బం గడుపుకోవాలంటే పార్టీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కం అవుతుంద‌ని జ‌గ‌న్ తీరుప‌ట్ల వైసీపీ నేత‌లు అసహనం వ్య‌క్తం చేస్తున్నారు.