కేసీఆర్ కు ఇక తీన్మారేనా.. ఏకమవుతున్న బీసీ నేతలు!
posted on Mar 22, 2021 @ 2:43PM
అధికార పార్టీ ఖాతాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు. ఆ ఆనందం ఎక్కువ సేపు ఉంచకుండానే మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్లు. అటు ఎమ్మెల్సీగా ఓడి గెలిచిన తీన్మార్ మల్లన్న జోరు. వరుస పరిణామాలు అనుకోకుండా జరిగాయా? అంతా వ్యూహాత్మకమా? అనే అనుమానం. రాజకీయాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే.. అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీసీ నినాదంతో తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందా? మంత్రి ఈటల, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యలతో పాటు అన్ని పార్టీలకు చెందిన అసంతృప్తులు ఒకే జెండా కిందకు రాబోతున్నారా? వారందరి ఏకైక ఎజెండా కేసీఆర్‌ను గద్దె దించడమేనా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీసీ నేతలకు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. వీళ్లంతా బడుగు, బలహీనవర్గాల అజెండాతో ముందుకు రాబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఓడినా.. ఆయనలో జోష్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఆయనలో ఉత్సాహం మరింత పెరిగింది. యూట్యూబ్ నుంచి స్టేట్ పాలిటిక్స్‌ను యూటర్న్ తిప్పేంత ఛరిష్మా వచ్చింది. మల్లన్నకు వచ్చిన ఓట్లు.. ఆయనకు లభించిన ఆదరణ.. రాజకీయ పార్టీలకు నమ్మశక్యం కానిది. వారికి సైతం అసాధ్యమైనది. ఈమధ్య కాలంలో ఇంతటి క్రేజ్ మరే నేతకు వచ్చి ఉండకపోవచ్చు. ఆ ఉప్పెనలాంటి వెల్లువను.. సునామీలా మార్చి.. సర్కారును అమాంతం ముంచేయాలని ఎత్తుగడలు వేస్తున్నారు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఓటమి తర్వాత విజయోత్సవంతో మల్లన్న చేసిన స్టేట్‌మెంట్స్ సైతం అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని.. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టే వరకూ.. సామాన్యుడు సీఎం సీట్లో కూర్చొనే వరకూ పోరాటం ఆపేది లేదంటూ గర్జించారు. మరి.. ఆ సామాన్యుడు ఎవరు? తీన్మార్ మల్లనే..నా?
ఒకవైపు మల్లన్న గర్జన కొనసాగుతుండగానే.. అదే టైమ్‌లో అల్లంత దూరాన.. మంత్రి ఈటల రాజేందర్ మరింత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈటల వ్యాఖ్యలు ఈమధ్య కాలంలో రొటీనే అయినా.. ప్రస్తుత సమయం, సందర్భంతో రాజకీయంగా మరింత కలకలం. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదంటూ ఈటల నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాను గాయపడినా మనసు మార్చుకోలేదని.. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషిని గుర్తు పెట్టుకోవాలంటూ మరింత మంట రాజేశారు రాజేందర్. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజలు తనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారన్నారు. మరి, అంత ఎత్త్తు నుంచి ఈటలను సడెన్‌గా కిందకు పడేసింది ఎవరు? వరుసగా ఆయన చేస్తున్న కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ ఎవరిని ఉద్దేశించి? ఈటల పార్టీ వీడతారని.. కొత్త పార్టీ పెడతారనే ప్రచారంలో నిజమెంత? ఇలా ఈటల విషయంలో రాజకీయ మంట ఎగిసిపడుతోంది.
కేసీఆర్‌కు, ఈటలకు చెడిందని.. మంత్రి రాజేందర్‌ను ముఖ్యమంత్రి పూర్తిగా పక్కన పెట్టేశారని అంతా అంటున్నారు. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ ఈటలకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కనీసం ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాలకు కూడా ఆయన్ను పిలవలేదు. కొత్త పార్టీ పెట్టడం పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదంటూ గతంలో గులాబీ బాస్ చేసిన కామెంట్లు సైతం ఈటలను ఉద్దేశించే అంటున్నారు. గులాబీ జెండాకు అసలైన ఓనర్లం మేమేనంటూ గతంలో ఈటల చేసిన హాట్ కామెంట్స్‌పై ఇంకా హాట్ హాట్ డిష్కషన్ జరుగుతోంది. తాజాగా, ఎమ్మెల్సీ ఫలితాలు తర్వాత మరోసారి ధర్మం, న్యాయం, కులం, డబ్బు అంటూ రాజేందర్ పేల్చిన డైలాగులు దుమ్మురేపుతున్నాయి.
తీన్మార్ మల్లన్న, ఈటల రాజేందర్.. ఆర్ కృష్ణయ్య ఈ ముగ్గురు బీసీలకు రాజ్యాధికారం తీసుకురావడమే లక్ష్యంగా కొత్త పార్టీతో ముందుకు రాబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఈటల పార్టీ పెడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా.. మల్లన్న మేటర్ ఇప్పుడు కొత్తగా జత కలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకు వచ్చిన ఓట్లు చూసి ఆయనలో కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగింది. ప్రజా మద్దతుతో వెయ్యేనుగుల బలం వచ్చినట్టైంది. దీంతో.. మరో పార్టీలో చేరి మామూలు లీడర్‌గా ఓ మూలన పడుండే బదులు.. సొంత పార్టీ పెట్టుకొని కింగ్‌లా కొనసాగడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చారని అంటున్నారు. కేసీఆర్ లాంటి కొండను ఢీకొట్టాలంటే.. సింగిల్‌గా కాకుండా ఓ పార్టీగా.. ఓ జెండాతో ప్రజల్లోకి వెళితే మరింత మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే, కుదిరితే తానే సొంతంగా పార్టీ పెట్టడమో.. లేదంటే, టీఆర్ఎస్ అసంతృప్తి నేత ఈటల రాజేందర్‌తో కలిసి.. బీసీ ఎజెండాతో కొత్త పార్టీతో.. ప్రజలను సమీకృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఎలా చూసినా.. త్వరలోనే తెలంగాణ గడ్డ మీద కొత్త పార్టీ పొద్దు పొడవడం ఖాయమే..