తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు అయినట్లేనా ....!
posted on Mar 22, 2021 @ 3:09PM
ఏపీలో తిరుపతి ఉపఎన్నిక హడావిడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించగా జనసేన బీజేపీ కూటమి తరుఫున బీజేపీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో ఈ ఎన్నిక కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్న బీజేపీ మాత్రం తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వారికీ కేంద్రంలో మంత్రి పదవి గ్యారంటీ అంటూ పార్టీ ఏపీ ఇన్చార్జి సునీల్ దేవ్ ధర్ ప్రకటన కూడా చేసేసారు. ఈ విహాయన్ని పార్టీ శ్రేణులు ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు. అయితే ఇప్పటివరకు తమ అభ్యర్థి పేరును మాత్రం ఇంకా ప్రకటించలేదు.
ఇది ఇలా ఉండగా తిరుపతి అభ్యర్థి కోసం పలువురు రిటైర్డ్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఐతే ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ను అభ్యర్థిగా రంగంలోకి దింపుతారని కూడా ప్రచారం జరిగింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరు తాజాగా పరిశీలనకు వచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం వీరిద్దరితోపాటు మరి కొంతమంది పేర్లతో ఒక లిస్ట్ ను అధిష్టానానికి పంపిందని ఇక దీనిపై బీజేపీ అధిష్టానం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరు ఖరారు అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.