చిన్నారులకు సోషల్ మీడియా యాక్సిస్ బంద్.. ఫ్రాన్స్ కీలక నిర్ణయం
స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో అమూల్యమైన బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులను రక్షించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ యుగంలో చిన్నారులు ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక సవాళ్లను అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశంలో 15 ఏళ్లలోపు వయస్సు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నిర్ణయించారు.
నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. పిల్లలను, కౌమార దశలో ఉన్నవారిని సోషల్ మీడియా, డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుంచి కాపాడుకుంటామని ఎనౌన్స్ చేశారు. ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రకంగా పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా కఠిన చట్టాన్ని తీసుకువచ్చిన తొలి దేశంగా నిలిచింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో పయనిస్తూ 15 ఏళ్ల వయస్సును డిజిటల్ మెజారిటీ గా నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత చట్టంపై ఈ నెలలోనే ఫ్రాన్స్ పార్లమెంట్‌లో చర్చ జరగనుంది. 2026 సెప్టెంబర్ నాటికి ఈ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు.
గతంలో సోర్బోన్ యూనివర్సిటీలో మేక్రాన్ చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరైనా తమ ఐదేళ్ల లేదా పదేళ్ల పిల్లలను ఒంటరిగా అడవిలోకి పంపిస్తారా? సోషల్ మీడియా కూడా అలాంటిదే. ఇది క్రమబద్ధీకరించబడని అడవి లాంటిది. అక్కడ పిల్లలు సైబర్ బుల్లియింగ్, అశ్లీలత, వేధింపులకు గురవుతున్నారని ఆయన అప్పటి ప్రసంగంలోనే హెచ్చరించారు. తాజా నివేదికల ప్రకారం.. సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల్లో నిద్రలేమి, ఏకాగ్రత తగ్గడం, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ప్రైమరీ, మిడిల్ స్కూళ్లలో ఫోన్లపై ఉన్న నిషేధాన్ని హైస్కూళ్లకు కూడా విస్తరించనున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి రాత్రివేళల్లో 'డిజిటల్ కర్ఫ్యూ' విధించే ఆలోచనలో కూడా ఫ్రాన్స్ సర్కార్ యోచిస్తున్నది.
దీనిని ఫ్రాన్స్‌లోని సుమారు 79 శాతం మంది తల్లిదండ్రులు సమర్థిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాకుండా మలేషియా, డెన్మార్క్, స్పెయిన్, రొమేనియా వంటి దేశాలు కూడా సోషల్ మీడియా నియంత్రణలపై సీరియస్‌గా దృష్టి పెట్టాయి. భారత్ లో కూడా అసభ్యకరమైన కంటెంట్ పై ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలు స్మార్ట్‌ఫోన్ల మత్తులో పడి తమ బాల్యాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి కఠిన చట్టాలు తప్పనిసరి అని సామాజికవేత్తలు అభిప్రాయపడు తున్నారు. ఫ్రాన్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా దిక్సూచిగా మారే అవకాశం ఉంది.