మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్టు
posted on Mar 15, 2024 @ 6:07PM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్రపై చాలా కాలంగా ఆరోపణలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐలు పలుమార్లు కవితను విచారించాయి.
అయితే అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈడీ, సీబీఐలు తమ దూకుడును తగ్గించేశాయి. అయితే కవిత మాత్రం ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. ఆ కేసు శుక్రవారం (మార్చి 15న) స్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని బెంచ్ ఎదుట విచారణకు వచ్చింది. అనంతరం కేసు విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. ఆ పిటిషన్ విచారణ వాయిదా పడిన అనంతరం హైదరాబాద్ నందినగర్ లోని కవిత నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సందర్భంగా కవిత నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కవిత తరఫు న్యాయవాదులను కూడా అనుమతించని ఈడీ అధికారులు, కవిత సెల్ ఫోన్ లను సైతం స్వాధీనం చేసుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు కవితను విచారించిన ఈడీ అధికారులు అనంతరం ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. స
రిగ్గా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా కవిత నివాసంలో ఈడీ సోదాలు, అరెస్టు సమాచారంతో మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన కేసీఆర్ నివాసానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.