ఈడీ, సీబీఐ పొంచి ఉన్నాయ్ తస్మాత్ జాగ్రత్త!
posted on Aug 29, 2022 @ 10:46AM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్రమత్తమయ్యారు. తాను అప్రమత్తం కావడమే కాకుండా పార్టీ నేతలనూ అప్రమత్తం చేస్తున్నారు. అదేదో మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనో లేదా వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ప్రజావ్యతిరేకతను అధిగమించడానికి తీసుకోవలసిన చర్యలపైనో కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు విషయంలో. రాష్ట్రంలో తెరాస అగ్రనాయకత్వం, నాయకులే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ చాలా కీన్ గా పరిశీలిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఆప్రమత్తమయ్యారు,
పార్టీ నేతలనూ అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఈడీ, సీబీఐలు అత్యంత క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాయి. ఏదో తీగే కదా లాగుతున్నాయి అని పట్టీపట్టనట్టు ఉంటే డొంకలు కదిలే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఈడీ సీబీఐ దాడులు, వాటి వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయన సమీక్షంచారు. ఎర్రవల్లిలోని పాంహౌజ్ లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌లో సమావేశం నిర్వహించారని పార్గీ వర్గాలు తెలిపాయి.
సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు హైదరాబాద్‌లోని పలు సంస్థల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేపడుతున్న విషయాన్ని ఈ భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలను, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఎండగడుతున్ననేపథ్యంలో గులాబీ నేతలు ఎక్కడ దొరుకుతారా కేసులు పెడదామా అని మోడీ ప్రభుత్వం కాచుకొని కూర్చుందని కేసీఆర్ ఈ భేటీలో పార్టీ నేతలను హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన కుమార్తె ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తుండటాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన ప్రతిఒక్కరు, ప్రజాప్రతినిధులు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు, సమావేశాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ హెచ్చరించినట్లు చెబుతున్నారు. అవినీతి, అవకతవకలు, కుంభకోణాల్లో ఇరుక్కో వద్దని, తద్వారా అనవసర ప్రచారాలకు, చెడ్డ పేరుకు తావు ఇవ్వొద్దంటూ ముఖ్యమంత్రి హెచ్చరించారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
పాదయాత్రలో ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేయటం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల తలెత్తిన సంఘటనలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఉటంకించినట్లు సమాచారం. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ నాయకులు మతం పేరుతో, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ తన సన్నిహిత వర్గాల వద్ద పేర్కొన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలుచేసిన పలు ఆదర్శవంతమైన విధానాల వల్ల దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు పెరిగాయని, తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతున్నాయని ఆయన చెప్పారని సంబంధిత వర్గాలు అన్నాయి. ఈ ప్రగతిని కాపాడుకోవాలని పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.