రాహుల్‌కి ‘నోటి’సులు!

 

 

 

ఎన్నికల ప్రచారం సందర్భంగా నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎన్నికల కమిషన్ ‘నోటి’సులు జారీ చేసింది. ముజఫర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు పరమ దరిద్రంగా ఉందన్న విమర్శలు అప్పుడే దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి.

 

ముస్లిం యువకులు తీవ్రవాదులకు సహకరిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ముస్లింలను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. అలాగే తన నాయనమ్మ ఇందిర, తన తండ్రి రాజీవ్ తరహాలోనే తనకూ ప్రాణహాని వుందని రాహుల్ అనడం ఓట్లకోసం దిగజారి మాట్లాడిన మాటలుగా అందరి చేతా విమర్శలు ఎదుర్కొన్నాయి.



 రాహుల్ మాట్లాడిన తీరు పట్ల అన్ని రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ విషయలో భారతీయ జనతాపార్టీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. కాస్తంత లేటుగా అయినా ఇ.సి. స్పందించింది. రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఈనెల 4వ తేదీలోపు తాను చేసిన వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ దున్నపోతు మీద వాన పడ్డ చందాన వ్యవహరిస్తోంది.



యువరాజు చేసిన దారుణమైన వ్యాఖ్యల్ని వెనుకేసుకుని వస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఇ.సి. నోటీసుల విషయంలో కూడా అదే ధోరణిని వ్యక్తం చేసింది. ఇ.సి. నోటీసుల వల్ల తమకి, తమ పార్టీకి, యువరాజు రాహుల్‌కి ఎలాంటి ఇబ్బందీ లేదని అంటోంది.