పాక్ పై భారత్ సునాయాస విజయం
posted on Jul 31, 2022 @ 10:07PM
భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో కామెన్‌వెల్త్ గేమ్స్ లో పాకిస్తాన్‌పై గెలిచింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిర్వాహకులు 18 ఓవర్లకే కుదించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాట్ చేసిన పాక్ జట్టు 18 ఓవర్లలో కేవలం 99 పరుగులే చేయ గలిగింది. వంద పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమ్ ఇండియా సునాయాసంగా కేవలం 11.4 ఓవర్లలోనే అధిగమించింది. స్మృతీ మంధన మెరుపువేగంతో భారీ షాట్లు కొట్టి అజేయ అర్ధసెంచరీ బాదడం చూడముచ్చటగా సాగింది.
జూలై 29న ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓడిపోగా, అదే రోజు బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్ పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగాయి. తొలి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో ఓడినప్పటికీ ఈ మ్యాచ్‌ను మాత్రం చాలా పట్టుదలతో గొప్ప ఆటతీరును ప్రదర్శించి భారత్ జట్టు విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాట్ చేసిన పాక్‌కు కెప్టెన్ మరూఫ్(17), ఓపెనర్ మునీబా (32) ఎంతో బాగా ఆడారు. కానీ ఆ తర్వాత భారత్ బౌలర్ల ధాటికి ఎవరూ నిలవలేకపోయారు. మేఘనా సింగ్, స్నేహరాణా అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేయగలిగారు. దీనికి తోడు ముగ్గురు బ్యాటర్లు రన్ఔట్ కావడం పాక్‌ను దెబ్బతీసింది.
కేవలం 100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు షఫాలీవర్మ(16), స్మృతీ మంధనా(65 నాటౌట్) సూపర్ బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ 5.5 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 61 పరుగులు చేసింది. మూడవ బ్యాటర్‌గా వచ్చిన సబ్బినేని మేఘన 16 బంతుల్లో 14 పరుగులు చేసింది.