టైమ్స్ నౌ తాజా సర్వే.. ముందస్తు సార్వత్రిక ఎన్నికలపై చర్చ
posted on Jul 3, 2023 @ 12:07PM
తాజగా టైమ్స్ నౌ సర్వే ఒకటి వచ్చింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే దేశంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం కచ్చితంగా వస్తుంది అని చెప్పుకొచ్చింది. అంటే దేశంలో రాజకీయ ముఖ చిత్రం మారకుండా ఉంటే మోడీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఆ సర్వే చెబుతోంది. అయితే ఈ డిసెంబర్ లో దేశంలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఏమైనా ఫలితాలు తేడా కొడితే, కర్నాటక తరహా ఫలితాలు వస్తే మోడీ ఇమేజ్ కూడా ఇబ్బందులో పడుతుంది. మూడో సారి అధికారం అన్న ధీమా ఉండదని కూడా ఆ సర్వే అంతర్లీనంగా చెప్పినట్లైంది. వాస్తవానికి టైమ్స్ నౌ మోడీ భజన పత్రికగా గుర్తింపు పొందింది. అటువంటి పత్రిక సర్వేలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనే.. మోడీ హ్యాట్రిక్ ఖాయం అంటూ తేలడంతో ఇప్పుడు బీజేపీలో అంతర్మథనం మొదలైంది.న
అంటే ఆయా రాష్ట్రాలఅసెంబ్లీల ఎన్నికల ఫలితాలు కచ్చితంగా సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే వాటితో పాటే లోక్ సభ ఎన్నికలు కూడా జరిపిస్తే.. అంటే మధ్యంతర ఎన్నికలకు మోడీ మొగ్గు చూపితే బాగుంటుందన్న సూచన ప్రాయమైన సలహా కూడా ఆ సర్వే ఇచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా ఆలోచిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే టైమ్స్ నౌ సర్వే కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనే మోడీకి మళ్లీ అధికారం అన్నది నొక్కి చెప్పిందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఆ సర్వేను బీజేపీ సీరియస్ గా తీసుకుందని కూడా అంటున్నారు.
దీంతో ముందస్తు సార్వత్రిక ఎన్నికల చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించేసింది. ఇప్పుడు ముందస్తు సార్వత్రిక ఎన్నికలంటే సాధ్యమేనా అన్న అనుమానానికి విశ్లేషకులు మోడీ తలచుకుంటే జరగనిదేముంటుందని అంటున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ముందస్తు ఎన్నికలకు సమాయత్తం చేసి సెట్ చేసేస్తారనీ, ఆ విధంగా ఆయన జమిలి ఎన్నికల లక్ష్యాన్ని ఈ సారే పాక్షికంగా అమలు చేసేసినట్లౌతుందనీ అంటున్నారు.
కేంద్రం, మోడీ అందుకు సుముఖంగా ఉంటూ సై అనడానికి ఏపీలోని జగన్ సర్కార్ రెడీగా ఉందని గుర్తు చేస్తున్నారు. టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఏపీలో జగన్ సర్కార్ కు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగితేనే మేలైన ఫలితాలు వస్తాయి. సరే ఆ సర్వేపై వస్తున్న విమర్శలు, కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలను పక్కన పెడితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కూడా అధికార పార్టీకే ఒకింత సానుకూలత వ్యక్తమౌతోంది. ఈ కారణంగానే ఇటు ఏపీలోనూ, అటు కేంద్రంలోనూ కూడా ముందస్తు చర్చ గట్టిగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకే కాకుండా ఏపీ వంటి రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగే అవకాశాలను కొట్టిపారేయ లేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ఈ నెల 5,6 తేదీలలో తలపెట్టిన హస్తిన యాత్రకు ముందస్తు చర్చతో ముడిపెడుతున్నారు.