తల్లి అంత్యక్రియలకు పర్మీషన్ ఇవ్వలేదని బాస్ పై కత్తితో దాడి
posted on Dec 18, 2020 @ 11:35AM
మా అమ్మ చనిపోయింది. అంత్యక్రియలకు వెళ్లేందుకు పర్మీషన్ ఇవ్వండంటూ ఓ ఉద్యోగి కోరగా బాస్ నిరాకరించాడు. దీంతో కోపోద్రికుడైన ఆ ఉద్యోగి కత్తితో బాస్ ని 11 సార్లు పొడిచాడు. ఈ ఘటన దుబాయ్ లో జరిగినప్పటికీ.. అక్కడ ఉద్యోగి, బాస్ ఇద్దరూ భారతీయులు కావడం గమనార్హం.
భారత్ కు చెందిన 25 ఏళ్ల యువకుడు కుటుంబాన్ని పోషించేందుకు ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు దుబాయ్ వెళ్లాడు. ఈ నేపథ్యంలో యువకుడికి తన తల్లి ఆనారోగ్యం కారణంగా చనిపోయిందని బంధువులు సమాచారం ఇచ్చారు. దీంతో తన తల్లి అంత్యక్రియలు చేసేందుకు భారత్ కి వెళ్లేందుకు పర్మీషన్ కావాలంటూ భారత్ కు చెందిన బాస్ ను రిక్వెస్ట్ చేశాడు. అందుకు బాస్.. నా చేతిలో ఏం లేదు.. అంతా కంపెనీయే చూసుకుంటుందని సున్నితంగా తిరస్కరించాడు.
అంతేకాదు 22 మంది ఉద్యోగుల్ని భారత్ కు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని, వారి లిస్ట్ తయారు చేసి ఇవ్వాలని సదరు కంపెనీ యాజమాన్యం బాస్ ను ఆదేశించింది. బాస్ ఓ లిస్ట్ తయారు చేసి యాజమాన్యానికి ఇచ్చాడు. ఆ లిస్ట్ లో తానుకూడా ఉంటానని బాధితుడు అనుకున్నాడు. కానీ లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో బాస్ తో గొడవపెట్టుకున్నాడు. తన చేతిలో ఏమీ లేదని, అంతా కంపెనీయే చూసుకుంటుందని బాస్ మళ్లీ చెప్పడంతో కోపోద్రికుడైన ఉద్యోగి.. బాస్ ను కత్తితో 11 పోట్లు పోడిచాడు. అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం బాస్ ను వెంటనే ఆస్పత్రికి తరలించింది. అదృష్టం బాగుండి బాస్ ప్రాణాలతో భయటపడ్డాడు. కాగా, బాస్ పై కత్తితో దాడి చేసిన ఉద్యోగిపై కేసు నమోదైంది. జనవరి 10న దుబాయ్ కోర్ట్ కేసును విచారించనుంది.