ముళ్లతీగలతో 2 వేల కిలోమీటర్ల గోడ! చైనా మరో వివాదాస్పద నిర్మాణం
posted on Dec 18, 2020 @ 10:58AM
సంచనాలకు మారుపేరుగా నిలిచే చైనా ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్మాణం చేపట్టింది. మయాన్మార్‌తో సరిహద్దు వెంబడి అత్యంత పొడవైన గోడను నిర్మిస్తోంది. తాజాగా వెలుగు చూసిన ముళ్లతీగలతో ఏర్పాటు చేస్తున్న ఈ గోడ ఏకంగా 2 వేల కిలోమీటర్ల పొడవు ఉంటుందని సమాచారం. మయాన్మార్ మీడియా వార్తల ప్రకరాం.. డిసెంబర్‌లో ఈ ముళ్లగొడ ఏర్పాటు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. చైనా కమ్యునిష్టు సర్కార్ చేపట్టిన ఈ నిర్మాణం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మయాన్మార్ నుంచి తమ దేశంలోకి ప్రవేశిస్తున్న అక్రమచొరబాటు దారుల్ని అడ్డుకోవడం కోసమే ముళ్ల తీగలతో గోడ నిర్మిస్తున్నామని చైనా చెబుతోంది. కాని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మత్రం చైనా వాదనను కొట్టిపారేస్తున్నారు. చైనాలోని ప్రభుత్వవ్యతిరేకులు, తిరుగుబాటు దారులు దేశసరిహద్దు దాటకుండా ఉండేందుకే ఈ చర్యకు పూనుకుందని చెబుతున్నారు.
మయన్మార్ సరిహద్దులో చైనా నిర్మిస్తున్న గోడపై అమెరికా ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా కారణంగా రాబోయే దశాబ్దాల్లో దక్షిణాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. మయాన్మార్ కూడా చైనా తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ ఆర్మీ అధికారులు చైనా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇరు దేశాల మధ్య 1961లో కుదిరిన సరిహద్దు ఒప్పందం గురించి లేఖలో ప్రస్తావించారు. అప్పటి ఒప్పందం ప్రకారం సరిహద్దు రేఖ వెంబడి ఇరు వైపులా 10 మీటర్ల వరకూ ఎటువంటి నిర్మాణం చేపట్టకూడదని, చైనా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి గోడ నిర్మిస్తుందని మయమ్నార్ ఆర్మీ అధికారులు లేఖలో స్పష్టం చేశారు.