Read more!

కడప ఎంపీకి దారులు మూసుకుపోయాయా?

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి దారులు మూసుకు పోయాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన అరెస్టు ఇక అనివార్యం అన్న భావనే సర్వత్రా వ్యక్తమౌతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వివేకానందరెడ్డికి తెలంగాణ హై కోర్టులో చుక్కెదురైంది.  సీబీఐ విచారణకు సంబంధించి ఆయన హైకోర్టులో దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ మేరకు సీబీఐను ఆదేశించలేమని స్పష్టం చేసింది. సీబీఐ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలనీ, విచారణపై స్టే ఇవ్వాలనీ అవినాష్ రెడ్డి కోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే.

అయితే ఆ రెండు అంశాలలోనూ కూడా కోర్టులో అవినాష్ కు ఎలాంటి ఊరటా లభించలేదు. విచారణ సందర్భంగా న్యాయవాది హాజరుకు అనుమతించినా, విచారణలో ఎటువంటి జోక్యం కలుగ జేసుకోకూడదని స్పష్టంగా కోర్టు ఆదేశించింది.

దీంతో ఈ కేసులో అరెస్టు కాకుండా అవినాష్ రెడ్డికి ఉన్న దారులన్నీ మూసుకుపోయినట్లేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.   దీంతో ఇప్పటి వరకూ నాలుగు సార్లు సీబీఐ విచారణను ఎదుర్కొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఐదోసారి కూడా విచారణకు హాజరు కాకతప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరైన ప్రతి సారీ ఆయన అరెస్టు తప్పదన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు కోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైన నేపథ్యంలో ఆయన అరెస్టుకు ఇక ఎలాంటి అడ్డంకులూ లేవన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.