చైనాపై రెండుసార్లు మనం గెలిచాం! ఆ యుద్ధాలు మీకు తెలుసా?
posted on Jul 7, 2017 @ 4:43PM
చైనా సైనికుల్ని కళ్లలో కళ్లు పెట్టి తీక్షణంగా చూస్తున్నారు మన జవాన్లు సిక్కింలో! ఇక రేపో, మాపో యుద్ధమే అన్నట్టు మాట్లాడుతోంది చైనీస్ మీడియా! అంతే కాదు, సిక్కింలో వేర్పాటువాదులకి మద్దతు తెలిపి ఆ రాష్ట్రాన్ని భారత్ నుంచి విడదీసేస్తుందట డ్రాగన్! ఇలాంటి ప్రేలాపనలు చాలానే రాస్తున్నాయి అక్కడి పత్రికలు! అంతకు ముందు చైనా అదికారులు 1962 నాటి రోజులు గుర్తు చేసుకోవాలని కూడా మనల్ని బెదిరించే ప్రయత్నం చేశారు. 1962నాటి రోజులు ఇప్పుడు పోయాయని రక్షణ శాఖ మంత్రి జైట్లీ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు!
చైనా 1962ని గుర్తు చేసి మనల్ని భయపెడుతోంది కదా… అసలు నిజంగా చైనా కంటే భారత్ అంత బలహీనమైన దేశమా? యుద్ధం వస్తే రెండు దేశాలకీ నష్టమా? కేవలం ఇండియా మాత్రమే కోలుకోలేని నష్టం చవి చూడాల్సి వస్తుందా? అలాంటిదేం లేదంటున్నారు విశ్లేషకులు. యుద్ధం వస్తే ఏం జరుగుతుందో తెలియదుగాని… అసలు కమ్యూనిస్టు దేశం మన మీదకి దండెత్తి రావటమే సాధ్యమయ్యే పని కాదంటున్నారు కొందరు ఎక్స్ పర్ట్స్ . అందుకు చరిత్రలో సాక్షాలు కూడా చూపిస్తున్నారు!
1962 యుద్ధంలో భారత్ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం ఎదుర్కొన్న మాట వాస్తవమే! కాని, ఆ తరువాత అయిదేళ్లకు ఇప్పుడు టెన్షన్ గా వున్న సిక్కిం ప్రాంతంలోనే ఇండియా , చైనాకు గట్టిగా బుద్ధి చెప్పింది. దీన్ని మినీ బ్యాటిల్ అంటారు! రెండు చోట్ల భారత్ భూభాగంలో చొరబడాలని ప్రయత్నించిన ఎర్ర సైనికులు మన జవాన్ల నుంచీ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. నాతూ లా , సెబు లా అనే ప్రాంతాల మధ్య కాల్పులు జరిగాయి. అలాగే, మరో సారి చో లా అనే ప్రాంతం వద్ద కూడా చైనా ముందుకు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ రెండు పోరాటాల్లో మొత్తం 80మంది భారతీయ జవాన్లు ప్రాణ త్యాగం చేశారు. కాని, అదే సమయంలో చైనా సోల్జర్స్ దాదాపు 4వందల మంది హతం అవ్వటంతో చేసేది లేక వెనక్కి తగ్గింది డ్రాగన్!
1986లో మరోసారి చైనా తన నక్క తెలివితేటలు చూపింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు ఉత్తరంగా టిబెట్ బార్డర్ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. విషయం తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ వెంటనే ప్రతిఘటన మొదలు పెట్టింది. అప్పుడు ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం కూడా లేకపోవటంతో హెలీకాప్టర్లలో అక్కడ ల్యాండైన ఇండియన్ సోల్జర్స్ చైనా మూకపై బుల్లెట్ల వర్షం కురిపించారు. వెంటనే ఫ్లాగ్ మీటింగ్స్ కు దిగొచ్చిన చైనీస్ ఆర్మీ వెనక్కి వెళ్లిపోక తప్పలేదు!
చైనాకు 1962 తరువాత మన దేశంతోనే కాదు మరే దేశంతోనూ చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. 1971లొ వియత్నాంతో యుద్ధం చేస్తే భారీ నష్టం మూటగట్టుకోవాల్సి వచ్చింది. 28వేల మంది వరకూ చైనా సైనికులు వియత్నాం యుద్ధంలో మరణించారు. కాని, చైనాతో 1962 ఓటమి తరువాత ఇండియా బంగ్లాదేశ్ ను విడదీస్తూ పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. అలాగే కార్గిల్ యుద్ధంలో కూడా మనదే పై చేయి అయింది. ఇలా చైనీస్ ఆర్మీ కంటే హిమాలయా ప్రాంతాల్లో మన ఆర్మీకే ఎక్కువ అనుభవం వుంది. ఇవేకాకుండా సిక్కింలో యుద్ధం చేసే చైనా సైనికులకి అవసరం అయినవి అన్నీ వేల కిలో మీటర్ల దూరం నుంచి రావాలి. కాని, మనకు సిక్కిం బెంగాల్ తో సహా ఈశాన్య రాష్ట్రాలు అన్నిటికి దగ్గరగా వుంటుంది. భూటాన్ కూడా మన ఆర్మీకి సాయం చేయటానికి సిద్దంగా వుంది.
ప్రస్తుతం చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం యుద్ధం వల్ల చైనాకు గెలిచినా, ఓడినా నష్టమే! అందుకే, పైపై బెదిరింపులే తప్ప చైనా నిజంగా యుద్దానికి దిగదని అంటున్నారు!