చెవినొప్పికి ఆపరేషన్ చేసి ఎడమ చేయి తీసేశారు!
posted on Sep 2, 2022 7:26AM
ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిందన్నది సామెత.. ఈ సామెతను దాదాపు నిజం చేసిన సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళకు చెవి నొప్పికి చేసిన చికిత్స ఆమె చేతిని కోల్పోయేలా చేసింది. బీహార్ కు చెందిన 20 ఏళ్ల రేఖ అనే మహిళ చెవి నొప్పితో పాట్నాలోని మహావీర్ సంస్థాన్ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి చెవి నొప్పి పోవడానికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.
జులై 11 ఆపరేషన్ చేశారు. అంత వరకూ అంతా బానే ఉంది. కానీ ఆపరేషన్ తరువాత ఆమె చేతికి ఒక ఇంజక్షన్ చేశారు. అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తరువాత రేఖకు ఇంజక్షన్ చేసిన ఎడమచేయిలో నొప్పి మొదలైంది. చేయి రంగు కూడా మారిపోయింది. దీంతో ఆమె మళ్లీ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించింది. అయితే వైద్యులు నిర్లక్ష్యంగా కొన్ని రోజులకు అదే తగ్గుతుంది లెమ్మని పంపేశారు.
అయితే ఆమెకు నొప్పి తగ్గకపోవడంతో పాట్నాలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆమె చేతిని పరీక్షించిన వైద్యులు ప్రాణం నిలబడాలంటే మో చేయి వరకూ తొలగించాలని నిర్ణయించి, గత నెల 4న శస్త్ర చికిత్స చేసి ఆమె ఎడమ చేతిని మోచేతి వరకు తొలగించారు. దీంతో నవంబర్ లో జరగాల్సిన ఆమె పెళ్లి రద్దయ్యింది.