ఆపరేషన్ లోటస్ ఫెయిల్.. విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ పాస్
posted on Sep 2, 2022 7:47AM
ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై పై చేయి సాధించింది. ఢిల్లీ అసెంబ్లీ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన మీద తానే ప్రవేశ పెట్టుకున్న విశ్వాస పరీక్షలో నెగ్గారు. మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ కు 62 మంది సభ్యలు ఉన్నారు. వీరిలో ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. మరొకరు జైల్లో ఉన్నారు. ఇంకొకరు స్పీకర్. దీంతో సభలో ఆప్ కు చెందిన 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ పై విశ్వాసం ప్రకటిస్తూ ఓటేశారు. దీంతో సునాయాసంగా విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ విజయం సాధించారు.
కేవలం 8 మంది సభ్యులతో ఆప్ సర్కార్ ను కూల్చేయడానికి బీజేపీ పన్నాగాలు, ఎత్తుగడలను తాము సక్సెస్ ఫుల్ గా తిప్పి కొట్టామని విశ్వాస పరీక్షలో విజయం సాధించిన తరువాత కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవా ల్ తో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. ఆప్ ను వీడి కమలం గూటికి చేరేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయలను బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ నేతలు ఆరోపించారు. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ఆదరణతోనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి ఆప్ నాయకులను టార్గెట్ చేస్తోందని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అసెంబ్లీలో సీఎం కేజ్రీవాల్ తన ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష నిర్వహించారు. గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా నివాసాలలో సీబీఐ జరిపిన దాడుల్లో ఏం కనుక్కొలేదని.. ఢిల్లీ సీఎం వ్యాఖ్యానించారు. బీజేపీ ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే గుజరాత్ లో కూడా ఆప్ పాగా వేయడం ఖాయమన్నారు.
అసలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి భయంతోనే ఆప్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులకు గురి చేస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.