పశువులు మెచ్చిన ప్రభువు ఎవరో తెలుసా ?
posted on Jul 27, 2022 @ 1:12PM
నవ్వడానికి అయినా నవ్వించడానికి అయినా, కమేడియన్లే కానక్కర లేదు, బ్రహ్మానందమే రానక్కర లేదు. రాజకీయ నాయకులు కూడా ఇంచక్కా, చక్కగా నవ్వించగలరు. నవ్వనూ గలరు. మళ్ళీ మనకు పొలిటికల్ కమేడియన్స్ అనగానే,ఒక కేఏ పాల్ లేదంటే ఆ రేంజ్ నాయకులు ఎవరో గుర్తొస్తారు కానీ, పాల్ ని మించిన కమేడియన్లు ఉన్నారని మనం గుర్తించలేక పోతున్నాం. దటీజ్ అవర్ బాడ్ లక్ .. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్నే తీసుకోండి, ఆయన ఎంత చక్కగా నవ్వుతారు. నవ్వీ నవ్వనట్లుగా, అదో రకంగా భలేగా నవ్వుతారు. (గిట్టని వాళ్ళు ఆయన నవ్వు ముఖానికి పూసుకున్తున్నట్లు ఉంటుందంటారు అనుకోండి అదివేరే విషయం).
నవ్వడంలోనే కాదు, నవ్వించడంలోనూ జగన్ రెడ్డికి జగన్ రెడ్డే సాటి. అయన భలే భలే జోకులేస్తారు. నిజానికి అయన మాటే ఒక జోకు... అందుకే, నవ్వడంలోనే కాదు, నవ్వించడంలోనూ జగన్ రెడ్డి మంచి మార్కులే వచ్చాయని అంటారు. మార్కులంటే గుర్తొచ్చింది. మీరు ఒక పరీక్ష రాసారు, అనుకోండి, మీకు ఆ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయి, ఫస్ట్ క్లాసొచ్చిందా? అసలు పాస్ మార్కులు అయినా వచ్చాయా, పాసయ్యారా? లేదా, అనేది ఎవరు నిర్ధారించాలి, మీకు ఎవరు మార్కులు వేయాలి ఆ పరీక్ష పేపర్ దిద్దిన మాష్టారు కదా, కానీ, జగన్ రెడ్డి స్కూల్ లో అలాకాదు. పరీక్ష ఆయనే రాస్తారు. మార్కులు ఆయనే వేసుకుంటారు. ఆయనకు ఆయనే సర్టిఫికేట్ కూడా ఇచ్చుకుంటారు. ఆ మధ్యన ఆయన మీటలు నొక్కే టెస్టులో నేను ఫస్టు క్లాస్ లో పాసై పోయాను.
నాకు ప్రజలు (ఏ ప్రజలు అని అడగకండి) 80 శాతం మార్కులు వేశారు. ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారు అని ఆయన జబ్బలు ఆయనే చరుచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గోదావరి వరదలను ట్యాకిల్ చేయడంలోనూ, తనకు తానే సాటని మరో మారు జబ్బలు చర్చుకున్నారు. మనుష్యులే కాదు, పశువులు కూడా తనను చూసి తెగ మురిసి పోతున్నాయని చెప్పుకొచ్చారు. పశువులకు నోరు లేక కానీ, లేదంటే, ఓహో జగనన్న .. ఆహ జననన్న.. నువ్వే మా రాజన్న .. అంటూ కీర్తి గీతాలు ఆలపించేవని, తమ కీర్తిని తానే చాటు కున్నారు. చాటింపు వేసుకున్నారు. తమకు వరద సాయం అందలేదని ఒక్కరూ కూడా చెప్పలేదని .. అందర్నీ ప్రభుత్వం ఆదుకుందన్నారు, అంతే కాదు, కట్టు బట్టలతో మిగిలిపోయిన, ప్రజలు, జగనన్న ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల రూపాయలు ఏమి చేసుకోవాలో తెలియక సంబరాలు చేస్కుంటున్నారనికూడా సంతోషంతో చిందులు వేశారు.
అంతే కాదు, ఇంతవరకు, ఏ ముఖ్యమంత్రి చెప్పని మరో గొప్ప రహస్యాన్ని కూడా శ్రీ జగన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు మాత్రమే ఇవ్వాలి కానీ, జనంలోకి రారాదని. వచ్చినా పరదాల చాటున, పోలీసుల మాటున రావాలే కానీ, కష్టాల్లో ఉన్న ప్రజలను పలకరించడం ముఖ్యమంత్రి చేయవలసిన పని కాదని , చాలా చక్కని సందేశం ఇచ్చారు. అంటే ఏంటి, నవ్వడానికి అయినా నవ్వించడానికి అయినా, కమేడియన్లే కానక్కర లేదు, బ్రహ్మానందమేరానక్కర లేదు. రాజకీయ నాయకులు కూడా ఇంచక్కా, చక్కగా నవ్వించగలరు. నవ్వనూ గలరు. ఇన్ ఫాక్ట్’ ఇతర రాజకీయ నాయకుల సంగతి ఎలా ఆన్నా, ఏపీ సీఎం జగన్ రెడ్డి లో మాత్రం ఓ మాంచి కమెడియన్ కూడా ఉన్నారు. సరే, ఆయన నవ్వుల సంగతి ఎలా ఉన్నా, అయన నవ్వుల పాలవుతున్నారు.. అంటారా ..అది మీ ఇష్టం