దిత్వా తుఫానుతో నెల్లూరు అతలాకుతలం
posted on Dec 3, 2025 @ 7:54PM
దిత్వా తుఫాను ప్రభావంతో నియోజకవర్గంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, చలిగాలుల తీవ్రత కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పంట పొలాలు జలమయం, కురిసిన వర్షాలకు పలు గ్రామాలలో వందలాది ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి.
ముఖ్యంగా వరి, ఇతర రకాల పంటలకు భారీ నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు పూర్తిగా వర్షపు నీటితో నిండి జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
రాగల ఒకటి, రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నదులు, చెరువులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం ప్రజలు కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని సూచించారు.