చిత్రపురి కాలనీ అక్రమాల కేసు విచారణ పూర్తి...ఫైనల్ రిపోర్ట్
posted on Dec 3, 2025 @ 8:18PM
హైదరాబాదు నగరంలోని గచ్చిబౌలి లో ఉన్న చిత్రపురి కాలనీ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన భారీ అక్రమాలపై సాగిన దాదాపు పదిహేనేళ్ల విచారణకు తెర పడింది. 2005 నుండి 2020 వరకూ చోటు చేసుకున్న అవకతవకలను పరిశీలించిన ప్రత్యేక కమిటీ తన ఫైనల్ రిపోర్ట్‌ను నవంబర్ 27న తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది.
విచారణలో భాగంగా సొసైటీ నిధుల దుర్వినియోగం, ఆస్తుల కేటాయింపుల్లో గందరగోళం, అక్రమ ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలు బయటపడినట్లు కమిటీ నివేదికలో స్పష్టమైంది. ఈ అక్రమాలకు మొత్తం 15 మందిని బాధ్యులుగా కమిటీ నిర్ధారించింది.ఈ వ్యవ హారంలో పాత, ప్రస్తుత కమిటీ సభ్యులతోపాటు కొంతమంది సినీ ప్రముఖుల పాత్ర కూడా ఉన్నట్లు రిపోర్టులో పేర్కొనడం ప్రత్యేకంగా నిలిచింది.
ఈ విచారణలో ప్రధానంగా ప్రస్తావించబడినవారిలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, అలాగే బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్ పేర్లు ఉన్నాయి. సొసైటీ కమిటీలో సభ్యులుగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి వీరికి సంబంధం ఉన్నట్లు రిపోర్ట్ సూచిస్తోంది.
మొత్తం గా జరిగిన అక్రమాల కారణంగా సొసైటీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు రూ. 43.78 కోట్లు రికవరీ చేయాలని, అదనంగా 18 శాతం వడ్డీతో సహా వసూలు చేయాలని గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ సూచించారు.ఫైనల్ రిపోర్ట్ కాపీని ఇప్పటికే సంబంధిత 15 మందికి పంపినట్లుగా అధికార వర్గాలు వెల్లడిం చాయి. ప్రభుత్వం రిపోర్ట్‌ను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.