డిగ్గీ రాజా వచ్చిన పని పూర్తయ్యిందా?
posted on Dec 23, 2022 @ 3:26PM
డిగ్గీ రాజా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు బయటకు దారి చూపారా? పార్టీ శ్రేణుల్లో జరుగుతున్నచర్చను బట్టి ఔననే అన్నారు. గత మెంతో ఘన కీర్తి గలవారమని విర్రవీగుతూ ఇప్పడు పార్టీకి గుదిబండగా మారుతామంటూ చూస్తూ ఊరుకునేది లేదని ఆయన ఒకింత కఠినంగానే సీనియర్లకు చెప్పేశారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభాన్ని నివారించడానికి అధిష్ఠానం దూతగా వచ్చిన దిగ్విజయ్.. పార్టీ నేతలతో విడివిడిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎటువంటి మొహమాటాలకూ తావులేకుండా పార్టీలో సీనియర్లు, జూనియర్లూ అన్నతేడాలేవీ ఉండవని కుండ బద్దలు కొట్టేశారు. ఎవరు పార్టీ కోసం.. పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తారో వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. తమ గత ఘనతల భుజకీర్తులతో పని చేయకుండా అందలాలు అందుకుందామనుకునే వారికి స్థానం లేదని చెప్పకనే చెప్పేశారు. ఒక రకంగా తమ సీనియారిటీకి తగిన గుర్తింపు లేకుండా పోయిందని మధన పడుతూ అసమ్మతి రాగాలు ఆలపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు దిగ్విజయ్ సింగ్ ఒక రకంగా మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలను పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డికి కట్టబెట్టినప్పటి నుంచీ ఆయనకు సీనియర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదురౌతూనే వస్తోంది. తొలి రోజులలో అందరినీ కలుపుకు పోవడానికి తన వంతు ప్రయత్నాలు చేసిన రేవంత్ తర్వాత తర్వాత తన కంటూ ఒక వర్గాన్ని ఏర్పరుచుకుని తన పని తాను చేసుకుంటూ పోవడం ప్రారంభించారు. సీనియర్లను, వారి విమర్శలను, వారి ధిక్కారాన్ని, అసంతృప్తిని, అసమ్మతిని పెద్దగా ఖాతరు చేయడం మానేశారు. దీంతో మరింత గా రగిలిపోతున్న సీనియర్లకు తాజా పీసీసీ కమిటీల నియామకం.. తమ అసమ్మతిని బహిరంగం చేయడానికి ఒక అస్త్రంగా దొరికింది.
తమకు గుర్తింపు లేకుండా పోయిందంటూ సీనియర్లు రేవంత్ పై విమర్శల దాడి పెంచడంతో రేవంత్ వర్గీయులు కూడా ప్రతి విమర్శలు చేయడమే కాకుండా పీసీసీ కమిటీలలో తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో రాష్ట్ర పార్టీలో అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడినట్లైంది. ఈ నేపథ్యంలోనే డిగ్గీ రాజా రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభ నివారణ కోసం ట్రబుల్ షూటర్ గా అధిష్ఠానం ఆదేశాల మేరకు హైదరాబాద్ వచ్చారు. వచ్చీ రావడంతోనే పనిలోకి దిగిపోయిన ఆయన సీనియర్లకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
పార్టీలో సీనియర్లు, జూనియర్లు అన్న కాన్సెప్ట్ లేదనీ, అందరూ సమానమేననీ కుండ బద్దలు కొట్టేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా పని చేసిన డిగ్గి రాజాకు రాష్ట్ర కాంగ్రెస్ నేతల అందరి వ్యవహారాలు పూర్తిగా తెలుసు. గతంలో ఆయనతో విభేదించిన వారిలో పలువురు ఇప్పుడు సీనియర్లుగా అసమ్మతి రాగం ఆలపిస్తున్న వారిలో ఉన్నారు. అందుకే డిగ్గీ రాజా రాష్ట్ర పార్టీలో సంక్షోభ నివారకుడిగా వస్తున్నారనగానే వారిలో చాలా మంది బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షోభ నివారణకు ప్రయత్నాలు అంటూ ఆయన సీనియర్లకు పార్టీ హైకమాండ్ కు అన్నీ తెలుసునని స్పష్టం చేశారు.
పార్టీ కోసం పని చేసే వారికే పదవులూ, గుర్తింపు అని తేల్చేశారు. ఒక విధంగా ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితే కొనసాగుతుందని చెప్పకనే చెప్పేసి బంతిని సీనియర్ల కోర్టులో వేశారు. ఇక తేల్చుకోవలసింది సీనియర్లే అని తన చేతులు దులిపేసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరితోనూ ముఖాముఖి సమావేవం అయ్యారు. వాళ్లు చెప్పినదంతా విన్నారు. చివరకు తన మాట ఏమిటో చెప్పేసి ఇక నిర్ణయించుకోవలసింది మీరే అన్నారు. దీంతో సీనియర్ల భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.