నున్నా రమణ....జైల్లో ఉన్నా బైట ఉన్నా ఒక్కటే!
posted on Feb 25, 2012 @ 3:05PM
ఖమ్మం జిల్లా: నున్నా రమణ....రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతున్న మద్యం సిండికేటు వ్యాపారి. అతను ప్రస్తుతం జైల్లోనే ఉన్నా ఖమ్మం జిల్లాలోని తన మద్యం వ్యాపారాలను ఎలాంటి ఆటంకం లేకుండా యధావిధిగా కొనసాగిస్తున్నాడు. అతను బైట ఉన్నాప్పుడు ఎలా లావాదేవీలు జరిగేవో ఇప్పుడు కూడా అదే స్టైల్లో మద్యం దందా దూసుకుపోతుంది. రమణకు ఎక్సైజ్, పోలీస్ శాఖతో ఉన్న సత్సంబంధాలే దీనికి కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. అతను బైట ఉన్న తన అనుచరులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మద్యం సామ్రాజ్యానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూస్తున్నాడని తెలిసింది. రమణ ముఖ్య వ్యాపార భాగస్వామి, అతని సోదరుడు, అనుచరులు ప్రస్తుతం వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని 154 మద్యం దుకాణాల్లో అత్యధిక దుకాణాలను బినామీ పేర్లతో చేజిక్కించుకుని, తన సిండికేట్ లోకి రాణి వ్యాపారులను గత రెండేళ్లుగా రమణ తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఏది ఏమైనా నున్నా రమణ ముడుపుల భాగోతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడం, త్వరలో బెయిలుపై వచ్చి మరిన్ని పేర్లు బైట పెడతానని అంటుండటంతో ఇంకా ఎన్ని సంచలనాలు చూడాల్సివస్తుందోనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.