తిరుమలలో భక్తుడి కిడ్నాప్ కలకలం
posted on Nov 9, 2020 @ 10:12AM
తిరుమలలో ఆదివారం సాయంత్రం ఓ భక్తుడి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే, కుటుంబీకుల సమాచారంతో.. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమై కిడ్నాపర్లను వెంటనే పట్టుకున్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన హనుమంతరావు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం ముగించుకుని ఎస్పీటీ అతిథిగృహానికి చేరుకోగానే.. నలుగురు వ్యక్తులు హనుమంతరావును బలవంతంగా ఓ కారులో ఎక్కించుకుని తిరుపతి వైపు దూసుకుపోయారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కారు నంబరును పోలీసులకు తెలియజేశారు.
పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమై అలిపిరి చెక్‌పాయింట్ వద్ద కారును అడ్డుకుని హనుమంతరావును రక్షించి.. కిడ్నా్‌పకు పాల్పడిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శ్రీనివాస్, మారుతి, పుట్టపర్తికి చెందిన కుమార్, చిత్తూరుజిల్లా చౌడేపల్లెకు చెందిన సురేష్ ఉన్నారు. పెనుగొండ కియా ప్లాంట్ ఎదుట క్యాటరింగ్ బిజినెస్ చేసేందుకు శ్రీనివాస్ వద్ద నుంచి రూ.20 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వక పోవడంతోనే హనుమంతరావును కిడ్నాప్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని తిరుమల డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు.