సీఎంవోలో మూడో పవర్ సెంటర్! యువ నేతల మధ్య వార్?
posted on Nov 9, 2020 @ 10:12AM
ఆ ఇద్దరు యువ నేతలు. ఒకరు మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాలనలో చక్రం తిప్పుతున్నారు. మరొకరు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకులుగా ఉంటున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య ముందు నుంచి సఖ్యత బాగానే ఉండేది. కాని ప్రస్తుతం ఆ ఇద్దరు యువ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇవే కామెంట్స్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఆ ఇద్దరు యువనేతలు ఎవరో కాదు.. ఒకరు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాగా... మరొకరు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. కేటీఆర్, సంతోష్‌రావుల మధ్య పంచాయితీ నడుస్తోందంటూ తాజాగా బాంబు పేల్చారు బండి సంజయ్. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సంజయ్ వ్యాఖ్యలు గులాబీ పార్టీలో గుబులు రేపుతుండగా.. తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా ఇందులు బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు.
సీఎంవోలో మూడో పవర్ సెంటర్ గా ఎంపీ సంతోష్ కుమార్ మారిపోయారనే చర్చ కొంత కాలంగా జరుగుతోంది. సీఎంవోలో సీఎం కేసీఆర్ కు మాజీ సీఎస్ రాజీవ్ శర్మ, సీనియర్ ఐఏఎస్ నర్సింగ్ రావులు కీలకంగా ఉన్నారు. వారితో పాటు మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్నారు. వారంతా సీఎం సెంటర్ గా పనిచేస్తారని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ కూ సీఎంవోతో పాటు ఉన్నతాధికారుల్లో సెపరేట్ టీమ్ ఉందని తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ లు అర్వింద్ కుమార్, జయేష్ రంజన్ లు కేటీఆర్ సెంటర్ లో ముఖ్యలని చెబుతారు. అయితే కొన్నిరోజులుగా ఎంపీ సంతోష్ కు మద్దతుగా మరో వర్గం తయారైందనే ప్రచారం జరుగుతోంది. సీఎంవోతో పాటు సచివాలయంలోనూ సంతోష్ కోటరి బలంగా ఉందని కొందరు టీఆర్ఎస్ నేతలే అఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.
నిజానికి గతంలో సీఎం కేసీఆర్ పర్యటనలు, ఆయన వ్యక్తిగత నిర్ణయాల వరకే సంతోష్ కుమార్ చూసేవారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు ఉండేవారు. అయితే రాజ్యసభకు పంపించాక ఆయనలో మార్పు వచ్చిందంటారు. ఇప్పుడు కేసీఆర్ కార్యక్రమాలు చూడటంతో పాటు పార్టీ, ప్రభుత్వ పాలనా వ్యవహరాల్లోనూ సంతోష్ కుమార్ యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. గతంలో ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ లు పోస్టింగులు, ప్రమోషన్ల కోసం కేటీఆర్ ను కలిసివారు.. ఇప్పుడు సంతోష్ తో కూడా తమ పని జరుగుతుందని వారు చెబుతున్నారట. అందుకే ఎప్పడూ బిజీగా ఉండే కేటీఆర్ కంటే సంతోష్ తో పని చేయించుకోవడమే బెటరనే అభిప్రాయం అధికారుల్లో ఉందంటున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా సంతోష్ ను పవర్ సెంటర్ గా చూస్తున్నాయని తెలుస్తోంది. ప్రమోషన్లు, బదిలీల కోసం కేటీఆర్ తో పాటు సంతోష్ కు కలుస్తున్నారనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది.
గతంలో సినీ, రాజకీయ ప్రముఖులంతా మంత్రి కేటీఆర్ చుట్టూనే తిరిగేవారు. తమకు ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు రావాలన్నా, సర్కార్ నుంచి రాయితీలు అడగాలన్నా అందరూ కేటీఆర్ దగ్గరకే వచ్చేవారు. కాని ఇప్పుడు కొందరు వ్యాపార, సినీ ప్రముఖులు ఎంపీ సంతోష్ ను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కూడా ఆయనకు బాగా ఉపకరిస్తుందని చెబుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సినీ, వ్యాపర దిగ్గజాలతో సంతోష్ కు పరిచయాలు పెరిగాయని, దీంతో ఆయన ఇమేజీ కూడా పెరిగిందనే చర్చ జరుగుతోంది. మీడియాను కూడా సంతోష్ మ్యానేజ్ చేస్తున్నారని, అందుకే ఆయన కార్యక్రమాలకు మంచి కవరేజ్ లభిస్తుందని చెబుతున్నారు.
మొత్తంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇటీవల కాలంలో తన ఇమేజ్ ను పెంచుకోవడంతో పాటు పార్టీ, ప్రభుత్వ వ్యవహరాల్లో కీలకంగా మారారని కేటీఆర్ టీమ్ కూడా గుర్తించిందని అంటున్నారు. సంతోష్ రావు తీరుపై కేటీఆర్ వర్గం గుర్రుగా ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది. ఇందుకు బలాన్నిచ్చేలా బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీని కలవర పరుస్తుందంటున్నారు. మొత్తానికి కేటీఆర్, సంతోష్ మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం ఆధిపత్య పోరు సాగుతుందనే సంజయ్ కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లోనూ, కారు పార్టీల్లోనూ కాక రేపుతున్నాయని చెబుతున్నారు.