మొన్న అత్త.. నిన్న అల్లుడు దౌర్జన్యం...
posted on Dec 11, 2020 @ 9:42AM
ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. టోల్ గేట్ సిబ్బందిపై దేవళ్ల రేవతి వీరంగం సృష్టించి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమె టోల్ ప్లాజా ఘటన పై వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే తాజాగా మరో వివాదం వెలుగుచూసింది. తాజాగా రేవతి మేనల్లుడు వడియరాజు వైద్య సిబ్బందిపై దాడి చేశాడంటూ సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. దాచేపల్లిలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోం లో ట్రీట్ మెంట్ తీసుకుని బిల్లు కట్టకుండా సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తన చికిత్సకు బిల్లు ఇంత అయిందా అని నర్సింగ్ హోం సిబ్బంది పై విరుచుకుపడ్డాడు. ఇదే సమయంలో తాను వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి మేనల్లుడిని అంటూ బెదిరించాడు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు ఆసుపత్రి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ఆస్పత్రి వర్గాలు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో రేవతిపై అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.