తెలంగాణ రైతు బ్యాంకు ఖాతాలో రూ. 473 కోట్లు
posted on Dec 11, 2020 @ 9:52AM
సాధారణంగా రైతులకు బ్యాంకుల్లో అప్పులు ఉండటం తప్ప.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉండటం చాలా అరుదు. ఎప్పుడో పంట అమ్మినప్పుడు వేలల్లోనో, మహా అయితే లక్షల్లోనే ఖాతాలో డబ్బులు పడతాయి. కానీ, ఒక సాధారణ రైతు ఖాతాలో వందల కోట్లు డబ్బులు ఉండటం ఎప్పుడైనా చూసారా?.. షాకింగ్ గా ఉందా?.. విన్న మనకే కాదు, తన ఖాతాలో వందల కోట్లు డబ్బులు ఉండటం చూసిన ఆ రైతు కూడా మనకంటే వంద రెట్లు ఎక్కువ షాక్ అయ్యాడు.
వివరాల్లోకి వెళితే, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు భువనగిరిలోని దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. అతను బుధవారం నాడు సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ కు ఓ పని నిమిత్తం వెళ్లి, తన అవసరార్థం డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లాడు. అయితే, ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బు రాకపోవడంతో, బ్యాలెన్స్ చూసుకోగా, ఖాతాలో ఏకంగా రూ. 473,13,30,000 ఉన్నట్టు చూపించింది. దీంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఆ ఏటీఎంలో తప్పుడు రిసిప్ట్ ఏమైనా వచ్చిందేమోనని.. వెంటనే అతను, పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చెక్ చేసుకున్నా, అంతే బ్యాలెన్స్ ఉన్నట్టు చూపింది.
ఇన్ని డబ్బులు తన ఖాతాలో ఎందుకు ఉన్నాయో, ఏటీఎం నుంచి డబ్బులు ఎందుకు రావడం లేదో కనుక్కునేందుకు తన ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లగా, సదరు రైతు ఖాతా ఫ్రీజ్ అయిందని అధికారులు వెల్లడించారు. ఏటీఎం రిసిప్ట్ లో భారీ మొత్తంలో బ్యాలెన్స్ చూపిస్తోందని చెప్పగా.. అతని ఖాతాలో కేవలం రూ. 4 వేలు మాత్రమే ఉన్నాయని సమాధానం ఇచ్చారు. దీంతో సంజీవరెడ్డి ఏమీ అర్థంకాక వెనుదిరిగి ఇంటికి చేరుకున్నాడు. కాగా, అతని ఖాతాలో వందల కోట్ల డబ్బు జమైందన్న విషయం రెండు రోజులుగా తుర్కపల్లి మండల ప్రాంత గ్రామాల్లో చర్చనీయాంశమైంది.