తల్లిని కాపాడేందుకు తండ్రిని చంపేశాడు
posted on Mar 31, 2016 @ 4:03PM
దిల్లీకి చెందిన సురేంద్ర కుమార్‌కు తాగుడు అలవాటు ఉంది. ఆ మత్తులోనే ఈ సోమవారం తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న సురేంద్ర కుమార్‌కు, అతని భార్యకి ఏదో విషయంలో మాటామాటా పెరిగింది. అంతే! తాగిన మైకంలో అతను తన భార్యని విచక్షణారహితంగా కొట్టడం మొదలుపెట్టాడు. ఈ ఇంట్లో చాలా రోజుల నుంచి జరుగుతున్న గొడవే ఇది. కానీ ఈసారి తన తండ్రి చేస్తున్న పనిని సురేంద్ర 17 ఏళ్ల కొడుకు సహించలేకపోయాడు. రాళ్లతో కొడుతూ, తన తండ్రి మీద అతను తిరగబడ్డాడు. ఆ దెబ్బలకి తాళలేక సురేంద్ర చనిపోయాడు.
తండ్రి శవాన్ని తీసుకువెళ్లి దగ్గరలోని ఒక ఖాళీ స్థలంలో పారేసి వచ్చాడు నిందితుడు. కానీ నేరం ఎన్నాళ్లని దాగుతుంది. స్థానికుల ఫిర్యాదుతో సురేంద్ర శవాన్ని కనుగొన్న పోలీసులు, నిందితుని అరెస్టు చేసి విచారణకు తరలించారు. తన తండ్రి చేసే అకృత్యాల నుంచి తల్లిని కాపాడుకునేందుకే, ఈ దారుణానికి ఒడిగట్టానని వాపోతున్నాడు నిందితుడు. ఈ కేసులో అసలు నేరం మద్యానిదేనేమో!