UP సీఎం ఇంటి పక్కనే శవం!
posted on Feb 16, 2016 @ 4:05PM
ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పే మరో ఉదంతం ఇది. ఈ నెల 10వ తేదీ నుంచి లక్నోలో ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బాధితురాలి కోసం ఊరంతా గాలించడం మొదలుపెట్టారు. దాదాపు అయిదు రోజుల ముమ్మర గాలింపు తరువాత ఆమె మృతదేహం గౌతంపల్లి అనే ప్రాంతంలో కనిపించింది. 12వ తరగతి చదువుతున్న ఆమె బడి నుంచి తిరిగి వస్తుండగా, ఎవరో దుండగులు అపహరించి, అత్యాచారం చేసి చంపేశారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న ఒక ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అధికార నివాసానికి కూతవేటు దూరంలోనే బాధితురాలి మృతదేహం కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ముఖ్యమంత్రి నివాసం వద్దే ఇలాంటి ఘటనలు జరిగితే, ఇక మారుమూల ప్రాంతాలలో ఉండేవారి పరిస్థితి ఏమిటో ఆ రాష్ట్ర ప్రజలకే తెలిసి ఉంటుంది.