ప్రేమించలేదని గొంతుకోసి హత్య
posted on Feb 16, 2016 @ 4:49PM
ప్రేమకు రోజురోజుకూ అర్ధం మారిపోతోంది. ప్రేమించిన వారి కోసం ప్రాణమివ్వడం పక్కన పెట్టి, తనకు దక్కకపోతే ప్రేమించిన అమ్మాయిని చంపే స్థాయికి నేటి ప్రేమ దిగజారింది. నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు అనే దుర్బుద్ధి, దుర్మార్గపు స్వభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘోరమే జరిగింది. తన సమీప బంధువుల అమ్మాయిని ప్రేమించిన ఓ ప్రబుద్ధుడు, ఆమెను తనకిచ్చి వివాహం చేయనన్నారని, ఆ అమ్మాయిని బలి తీసుకున్నాడు. ఆమె పీక కోసి హత్య చేసి, పోలీసులకు లొంగిపోయాడు. వివరాల్లోకెళితే..
తమిళనాడులోని పుదుపట్టి కాలనీలో జౌళి వ్యాపారం చేసుకునే చంద్రశేఖరన్ కుటుంబం నివాసం ఉంటోంది. చంద్రశేఖరన్ కుమార్తె అభిరామి(18), స్థానికంగా ఉండే టిటీఈ ట్రైనింగ్ సెంటర్ లో మూడో సంవత్సరం చదువుతోంది. ఈ కుటుంబానికి సమీప బంధువైన తమిళ్ కుమరన్ (16) వారి ఇంటికి రోజూ వస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి అభిరామిపై ఇష్టం కలిగింది. తన కంటే రెండేళ్లు పెద్దదైన ఆమె అతని ప్రేమకు అంగీకరించలేదు. పెద్దలు కూడా అతని ప్రేమను ఒప్పుకోలేదు. కొంత కాలానికి అభిరామికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. అది తట్టుకోలేని కుమరన్, అభిరామి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేసి, గొంతుకోసి హత్య చేశాడు. అదే కత్తితో, దగ్గర్లోని కోర్టుకెళ్లి లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.