జగన్ కోటవైపు దాసరి పయనం

 

కాపుల ఓటు బ్యాంక్ ని చీల్చేందుకు జగన్ పార్టీ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి పెద్దపీట వేయడంతో ఆయనకు దీటుగా ఉండే నాయకుడ్ని తన పార్టీలోకి చేర్చుకునేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. దాసరి నారాయణరావు అయితే సరిగ్గా సరిపోతారని జగన్ పార్టీ అంచనా. అందుకే ఆయనకు మంచి ఆఫరిచ్చారు.

 

దాసరి త్వరలోనే తన అనుచరులతో జగన్ పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయ్. కొద్ది రోజుల్లోనే ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ నిర్ణయం చంచల్ గూడ జైల్లో జగన్ ని కలిసిన తర్వాతే తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దాసరి, ఈ విషయమై వై.వి. సుబ్బారెడ్డితో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.

 

దాసరి పార్టీలో చేరితే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కాపుల్ని ఆకట్టుకోవచ్చన్నది జగన్ అంచనా. వంగవీటి రాథాకృష్ణనికూడా పార్టీలో చేర్చుకుంటే కృష్ణాజిల్లాలో బలం బాగా పెరుగుతుందన్న ఆలోచనకూడా జగన్ వర్గానికొచ్చింది. పశ్చిమగోదావరి జిల్లానుంచి ఓ ఎంపీ తన తమ్ముణ్ణి జగన్ పార్టీలో చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలుకూడా సానుకూలమయ్యేలా కనిపిస్తున్నాయ్.

 

కెవిపి వియ్యంకుడు రఘురామకృష్ణంరాజుకి జగన్ పార్టీ తరఫున నర్సాపురం స్థానం ఖాయమైనట్టు తెలుస్తోంది. రేపోమాపో కెవిపినికూడా పూర్తిగా పార్టీ వైపుకి తిప్పుకుంటే ఇక రాష్ట్రంలో పూర్తిగా కాపుల్ని తనవైపుకి మళ్లించుకోవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.