ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లూ అమ్మేసుకోండి బాబూ..!

 

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపినేత పి.వి.కృష్ణారావు అసలు పార్టీని వదిలి వెళ్లడానికి కారణం ఏంటి? చాలాకాలంగా టిడిపిని నమ్ముకుని ఉన్న ఆయన ఎందుకు ఉన్నట్టుండి వైకాపాలోకి వెళ్లిపోయారు? అనే ప్రశ్నలకు సమాధానం రాజ్యసభ సీటు.

కృష్ణారావు రాజ్యసభ సీటు కావాలని కోరుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని బాబు కోరినప్పుడు తనకి ఆసక్తి లేదని, రాజ్యసభ సభ్యత్వం ఇప్పించాలని కోరారుకూడా. తప్పకుండా ఇప్పిస్తామని చంద్రబాబు హామీకూడా ఇచ్చారు. కానీ.. తీరా సమయం వచ్చేసరికి సృజనా చౌదరికి ఆ సీటు దక్కింది.

సృజనా చౌదరి పార్టీకోసం చాలా డబ్బు ఖర్చుపెట్టారు కాబట్టి ఆయనకి రాజ్యసభ సీటు ఇవ్వాల్సొచ్చిందని చంద్రబాబు కవర్ చేయడంతో కృష్ణారావుకి చిర్రెత్తుకొచ్చింది. ఆవేశం పట్టలేకపోయిన కృష్ణారావు చంద్రబాబుని కలిసినప్పుడు.. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లుకూడా వేలం వేస్తే పోలా అని ఓ సలహాకూడా ఇచ్చారట.

టిడిపిలో తనకి రాజ్యసభ సీటు రాలేదు కనకే పార్టీ మారుతున్నానని కృష్ణారావు బాహాటంగానే ప్రకటించారు. అంటే వైకాపాలో చేరితే తప్పకుండా రాజ్యసభ సభ్యత్వం ఇప్పిస్తానని జగన్ ఆయనకి గట్టి హామీ ఇచ్చినట్టేనని అటు టిడిపి నేతలు, ఇటు వైకాపా నేతలు అనుకుంటున్నారు.