వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి దానం ?

 

 

 

 

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ జగన్ పార్టీలో చేరనున్నారా ? ఆయన చేసిన ప్రకటనను బట్టి దీనికి సమాధానం అవుననే అనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి తరవాతి ముఖ్య మంత్రి అవుతాడని ఆయన ప్రకటించారు. దీనిని ఎవరూ అడ్డుకోలేరని కూడా దానం ప్రకటించేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటనను పదే పదే ఉచ్చరించారు.

 

ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో ఇలాంటి వ్యాఖ్యలు ఏ నాయకుడు అయినా చేశాడంటే దానర్ధం వారు జగన్ పార్టీలో చేరడానికి రెడీ అయినట్లే భావించాల్సి ఉంటుంది. ఒక్క సారి గతంలోకి వెళ్తే, దానం తెలుగు దేశం నుండి కాంగ్రెస్ లోకి మారడం, ఆ తర్వాత మంత్రి పదవి పొందడం అంతా వైఎస్ పుణ్యమేనన్న విషయం తెలిసిందే. వైఎస్ కు అత్యంత ప్రియమైన శిష్యుడుగా దానంకు పేరు ఉండేది.

 

రాష్ట్ర మంత్రిగా ఉండి దానం చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వైఎస్ ను జగన్ రోజూ తలచుకొంటాడో లేదో కానీ, తన భార్య మాత్రం రోజూ తలచుకొంటుందని కూడా దానం స్టేట్మెంట్ ఇచ్చేసారు. అంతే కాదు, పాద యాత్రలో గాయపడిన షర్మిలాను తాను త్వరలో పరమర్సిస్తానని కూడా అన్నారు. ఇందులో తప్పేముందని కూడా ఆయన అన్నారు. దానం జగన్ పార్టీలో చేరతారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

 

 

ఆయన నగరంలో గట్టి పట్టున్న నాయకుడు కావడంతో, తమ పార్టీ నగరంలో బలపడడానికి దానం చేరిక తోడ్పడుతుందని జగన్ పార్టీ నేతల అంచనాగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దానం ఖైరతాబాద్ నుండి గెలవడంలో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం అండ ఉండటం కూడా తోడ్పడింది. ప్రస్తుతం ఎంఐఎం, జగన్ పార్టీ వైపు అడుగులు వేస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుండి దానం జగన్ పార్టీ నుండి గెలవడం తేలికే అవగలదు.