విజయన్ నిర్ణయాలతో ఏచూరి నారాజ్ ..
posted on May 21, 2021 @ 4:01PM
కేరళ ముఖ్యమంత్రిగా రెండవసారి పదవే బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన పినరాయి విజయన్, నూతన మంత్రి వర్గ కూర్పులో ఇంతవరకు ఎవరూ చేయని వినూత్న ప్రయోగం చేశారు. పాత ముఖాలు అన్నిటినీ తీసీసి, కొత్త వారికి అవకాశం కలిపించారు. నిజానికి, పార్టీలతో సంబంధం లేకుండా మరే ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోరు. తీసుకోలేరు. కానీ, విజయన్ ఆ సాహసం చేశారు.
దేశంలో వామపక్ష పార్టీల ప్రస్తుత పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీల కంచుకోటలు అనుకున్న పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో పార్టీ తుడిచి పెట్టుకు పోయింది. మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్’ అసెంబ్లీ ఎన్నికల్లో ,కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి పోటీచేసినా లెఫ్ట్ కూటమికి ఒక్క సీటు కూడా దక్కలేదు. త్రిపురలో అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో సిపిఎం అధికారం కోల్పోయింది. మొత్తం 60 మంది సభ్యులున్న సభలో కేవలం 16 సీట్లు మాత్రమే దక్కించుకుంది.తొలిసారిగా కాషాయ జెండా ఎగరేసిన బీజేపీ సొంతగా 36 సీట్లు గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షం ఐపీఎఫ్’టీ మరో 8 స్థానాలలో విజయం సాధించింది. అంతకు ముందు 2013లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయిన బీజేపీ, ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈ నేపధ్యంలో, సిపిఎం, వామపక్ష కూటమి అధికారంలో ఉన్న ఏకైక రాష్టం కేరళ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయన్ సారధ్యంలో వామపక్ష కూటమి, అనూహ్య విజయం సాధించింది. సుమారు 40 సంవత్సరాల తర్వాత వరసగా రెండవసారి లెఫ్ట్ కూటమి అధికారంలోకి వచ్చింది. విజయన్ రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి విజయన్, ఆయనొక్కరు తప్ప, ఫస్ట్ కాబినెట్ లోని మరెవ్వరికీ కొత్త మంత్రివర్గంలోకి తీసుకోలేదు.అయితే, విజయన్ తీసుకున్నఈ నిర్ణయాన్ని మాజీ మంత్రులు, ఎవరూ బహిరంగంగా ప్రశ్నించలేదు. కానీ, అంతర్గతంగా పార్టీలో చిచ్చురేపుతోంది. విజయన్ నిర్ణయంతో మాజీలుగా మిగిలియన్ సీనియర్ మంత్రులే కాదు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. సీనియర్లకు ఉద్వాసన పలకడంతో పాటుగా, మొదటిసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన తన అల్లుడు పి ఎ మహమ్మద్ రియాస్’ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో కుటుంబ రాజకీయాలకు, అదే విధంగా ఆధిపత్య రాజకీయాలకు విజయన్ తెర తీస్తున్నారని పార్టీలో చర్చ మొదలైంది. ఆయన
నిరంకుశ ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి.
ఆరోగ్య మంత్రిగా కొవిడ్ కట్టడిలో సమర్ధవంతంగా పనిచేసి, అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న కె శైలజను మంత్రివర్గంలో స్థానం కలిపించక పోవడం, ఆమెతో పాటుగా టి పి రామకృష్ణన్, ఎం. ఎం. మని, కడకంపల్లి సురేంద్రన్, ఏసీ మొయిద్దీన్ వంటి సీనియర్ మంత్రులకు మరోమరు అవకాశం ఇవ్వకపోవడం పార్టీ వర్గాలలో తీవ్ర అసంతృప్తికిదారితీస్తోందని పార్టీ వరగాల్లో వినవస్తోంది. అదే విధంగా, సిపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఎల్డిఎఫ్ కన్వీనర్ ఎ విజయరాఘవన్ భార్య ఆర్ బిందుకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నారు. సిపిఎం లో ఈ విధమైన బంధుప్రీతి గతంలో లేదని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిపై వస్తున్న విమర్శల పట్ల శైలజ హుందాగా స్పదిస్తున్నారు. తనకు పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేర్చానని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదని, వ్యవస్థ ప్రధానం అని చెబుతూ నూతన బృందం మంచిగా పనిచేయగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు.
శైలజను మంత్రివర్గం నుండి మినహాయించడంతో పాటు మంత్రుల ఎంపికలో రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరుపట్ల సిపిఎం కేంద్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. పైగా ఈ విషయంలో తమను సంప్రదించగా పోవడం పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి , పొలిట్‌బ్యూరో సభ్యుడు బృందా కారత్ ఈ నిర్ణయంతో నిరాశ చెందారని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. విజయన్ ఏకపక్ష నిర్ణయాల పట్ల ఏచూరి నాజార్ అవుతున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ఒక్క సీట్ కూడా తెచ్చుకోలేక పోవడం, విజయన్ అపూర్వమైన రీతిలో వామపక్షాలను తిరిగి అధికారంలోకి తీసుకురావడంతో, కేంద్ర నాయకత్వం ఈ సమయంలో ఏమీ మాట్లాడలేని నిస్సహాయస్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నది.
పార్టీ కేంద్ర కమిటీ తదుపరి సమావేశంలో ఈ సమస్య చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, “సిపిఎం ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేరడానికి సంబంధించిన విషయాలు పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించే అంశాలు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆ అంశంపై చర్చించి ఏకగ్రీవంగా దీనిపై నిర్ణయం తీసుకుంది ” అంటూ ఏచూరి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
శైలజను మంత్రివర్గంలోకి తీసుకొనక పోవడం రాష్ట్ర, జాతీయ స్థాయిలో వామపక్షాలకు కొన్ని సమస్యలు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు సిపిఐ నాయకత్వం కూడా భావిస్తున్నది. అయితే మంత్రివర్గంలో తమ ప్రతినిధులను ఎంచుకొనే హక్కు సిపిఎంకు ఉంటుందని సిపిఎం జాతీయ కార్యదర్శి డి రాజా స్పష్టం చేశారు. అయితే, విజయన్ ఇతర విషయాల్లోనూ ఇదే ధోరణి అవలంబిస్తే ముసలం పుట్టడం ఖాయమని పార్టీ నాయకులే అంటున్నారు .