ఏపీ, తెలంగాణాలలో బీజేపీతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ..
posted on Dec 14, 2020 @ 12:04PM
ప్రస్తుతం ఏపీ తెలంగాణాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఒకపక్క ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు.. మరోపక్క తెలంగాణలో టీఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీలు బీజేపీతో ట్రయాంగిల్ లవ్ లో ఉన్నాయని అయన సెటైర్లు వేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన సమయంలో వచ్చిన కొన్ని అవినీతి జీవోలు, కార్యకలాపాల చిట్టాను కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా బయటకు తీశారని, దీంతో కేసీఆర్ హడావిడిగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారని అయన ఆరోపించారు.
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి వారి ఆందోళనలకు సంఘీభావం తెలపాలని నారాయణ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీ కనుసన్నల్లో బతుకుతున్నారని నారాయణ ఎద్దేవా చేసారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అమరావతిని శ్మశానం చేసేందుకు కంకణం కట్టుకుందని అయన ధ్వజమెత్తారు. నారాయణ తాజా కామెంట్లపై వైసీపీ, టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.