Read more!

కవితపై కోర్టు సీరియస్.. మీడియాతో మాట్లాడవద్దంటూ మందలింపు!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. మద్యం కుంభకోణంలో ఆమె కీలకమని సీబీఐ, ఈడీలు గట్టిగా చెబుతున్నాయి. ఆమె సక్ష్యాల టాంపరింగ్ కు సంబంధించి ఆధారాలను కోర్టుకు సమర్పించాయి. దీంతో కోర్టు ఆమెకు బెయిలు నిరాకరించింది.  తాజాగా కోర్టు కవితపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కవిత జ్యూడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియడంతో  ఆమెను సీబీఐ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు ఆమె జ్యుడీషియల్  కస్టడీ  ఏప్రిల్ ల్ 23 వరకు పొడిగించింది.  అయితే కవిత కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై కోర్టు సీరియస్ అయ్యింది.  కోర్టు ఆవరణలో తాను ఉన్నది సీబీఐ కస్టడీలో కాదనీ, బీజేపీ కస్టడీలో ఉన్నాననీ చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది.  కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటం సరికాదని విస్పష్టంగా చెబుతూ మరో సారి అలా మాట్లాడేందుకు వీలులేదని గట్టిగా హెచ్చరించింది.

కవిత కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు బయట ఏం మాట్లాడుతున్నారో అవే విషయాలపై సీబీఐ అధికారులు తనను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఇప్పడనే కాకుండా కవిత అరెస్టైనప్పటి నుంచీ దర్యాప్తు సంస్థలు కోర్టుకు హాజరు పరిచిన ప్రతిసారీ మీడియా ముందు మాట్లాడుతున్నారు. కోర్టు తాజా హెచ్చరికతో ఇకపై ఆమె కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడే అవకాశం లేదు.

ఇలా ఉండగా సీబీఐ కస్టడీలో ఉన్న ఆమెను మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్వయానా కవితకు అన్న అయిన కేటీఆర్ కలిశారు. ఆ సందర్భంగా జైల్లో ఆమెకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలపై ఆరా తీశారు. త్వరలోనే బెయిలు వస్తుందనీ, అధైర్య పడవద్దనీ భరోసా ఇస్తూ ధైర్యం చెప్పారు.