భారత్ లో కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 1129 మంది మృతి
posted on Jul 23, 2020 @ 10:06AM
భారత్‌లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. గత 24 గంటలలో దేశం మొత్తం కలిపి 45,720 కొత్త కేసులు నమోదు కాగా 1129 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఐతే నిన్ననే 29,557 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. భారత్‌లో ఒక్క రోజులోనే ఇంత భారీ సంఖ్యలో మరణాలు నమోదవడం ఇదే మొదటి సారి. ఇది ఇలా ఉండగా తమిళనాడులో కరోనా మరణాలపై ఏర్పాటైన కమిటీ సమర్పించిన తాజా నివేదిక ప్రకారం గతంలో చనిపోయిన వారిని కూడా కలిపి చెన్నైలో 444 మరణాలను నమోదు చేశారు. వీరి మరణాలను ప్రభుత్వ రికార్డుల్లో ఇంతకు ముందు నమోదు చేయకపోవడంతో ఇపుడు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో బుధవారం కోవిడ్ మృతుల జాబితాలో చేర్చడంతో మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నిన్నటివరకు భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,38,635కి చేరింది. ఇందులో 7,82,606 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని హాస్పిటల్స్ నుండి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు భారత్ లో 29,861 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 4,26,167 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.