కరోనా భయంతో ఆదిలాబాద్ జిల్లాలో దారుణం
posted on Mar 30, 2021 @ 10:25AM
తెలంగాణలో కరోనా మహ్మమారి విస్తరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ భారీగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో గత మార్చిలో లాక్ డౌన్ విధించినప్పటి పరిస్థితులు మళ్లీ గ్రామాల్లో కనిపిస్తున్నాయి. కరోనా భయంతో వణికిపోతున్న జనాలు.. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కరోనా సోకిందన్న కారణంతో ఓ యువతిని ఊళ్లోకి అడుగుపెట్టనీయకుండా గ్రామ పెద్దలు అడ్డుకున్నారు. ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగిందీ..
సాలెగూడకు చెందిన మడావి సోన్‌దేవి గురుకులంలో ఉంటూ ఇంటర్ చదువుతోంది. గురుకులంలో కరోనా పరీక్షలు చేయగా బాలికకు కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ అయింది. దీంతో బాలిక హోం క్వారంటైన్ లో ఉండేందుకు సొంతూరుకు వచ్చింది. విషయం తెలిసిన గ్రామ పెద్దలు ఆమెను ఊరిలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక ఊరి చివరన ఉన్న తమ పొలంలో ఆ బాలిత ఐసోలేషన్‌లో ఉంది. అక్కడ కరెంటు సౌకర్యం లేకపోవడంతో రాత్రుళ్లు చిమ్మ చీకట్లో భయంభయంగా గడుపుతోంది. విషయం తెలిసిన ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్, గురుకులం ఆర్‌సీవో గంగాధర్ నిన్న గ్రామానికి వచ్చి బాలికను పరామర్శించారు.
పంచాయతీ పెద్దలను కలిసి ఆమెను గ్రామంలోకి అనుమతించాలని అధికారులు కోరారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె క్వారంటైన్ పూర్తయ్యేవరకు ఊరిబయట ఉండకతప్పదని పెద్దలు తేల్చి చెప్పారు. దీంతో ఊరు చివరన ఉన్న పొలం దగ్గరే ఉంటోంది బాలిక. జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటున్నారు.