ముంపు గ్రామాలను కలిపింది బంగ్లాదేశ్‌లో కాదు: వెంకయ్య
posted on Jun 7, 2014 @ 3:40PM
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అనే అంశం మీద టీఆర్ఎస్ నాయకులు లబోదిబో అని మొత్తుకుంటూ నానా హడావిడి చేస్తున్నారు. వీరి మీద బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయకుడు సెటైర్ వేశారు. పోలవరం ముంపు ప్రాంతంలోని ఏడు మండలాలను తాము కలిపింది మన దేశంలో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేనని బంగ్లాదేశ్‌లాంటి పరాయి దేశంలో కాదని వ్యాఖ్యానించారు. ఆ మండలాలలను అటు కలిపినా, ఇటు కలిపినా పోయేదేమీ లేదని అన్నారు. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల తెలంగాణకు నష్టం రాదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ఆంద్ర ప్రజల జీవన రేఖ అని ఆయన అభివర్ణించారు. రాజకీయ లబ్ధికోసం ఇరు ప్రాంతాల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించవద్దని ఆయన అలా విభేదాలు సృష్టిస్తున్న వారికి సలహా ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తప్పక లభిస్తుందని వెంకయ్య పునరుద్ఘాటించారు. కొందరు ఆ నాయుడు,ఈ నాయుడు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యలు చేస్తున్నారని, అది సరికాదని చెబుతూ నాయుడు అంటే నాయకుడు అని వెంకయ్య నాయుడు అర్థం వివరించారు.