రెండు రాష్ట్రాల అభివృద్ధే మా లక్ష్యం: నిర్మల
posted on Jun 7, 2014 @ 3:50PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిర్మల సీతారామన్ హైదరాబాద్ వచ్చారు. ఆమెకు షంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ను రాష్ట్ర బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి వుందన్నారు. రెండు రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. రెండు రాష్ట్రాలలో ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను అభివృద్ధికి తనవంత సహకారం అందిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు అధికమవుతాయని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.