రవి రాకకు, కిరణ్ నిర్వేదానికి కారణం ఏమిటి?
posted on Apr 17, 2012 @ 4:52PM
కాంగ్రెస్ సీనియర్ నేత వాయలార్ రవి ఆకస్మికంగా హైదరాబాద్ రావడం చూస్తుంటే రాష్ట్రంలో ఏదో మార్పు రాబోతునట్లు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిని మార్చడం, ప్రత్యేక తెలంగాణా అంశం, ఉప ఎన్నికల ఎత్తుగడ వంటి అంశాలపై చర్చించడానికి విచ్చేసినట్టుగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగాలు, నిర్వేదంతో ప్రవర్తనను చూస్తుంటే ఆయనను పదవి నుంచి తప్పించే అవకాశం వున్నట్లు కనిపిస్తోంది. రోశయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే సమయంలో కూడా నాడు రోశయ్య కూడా ఇదే తరహాలో నిర్వేదంతో మాట్లాడారు. పదవి నుంచి తప్పుకోవడానికి 48 గంటల ముందు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రోశయ్య కార్యకర్తలతో మాట్లాడుతూ సహనం కోల్పోయి.."నన్ను ఎం చేయమంటారు...పదవికి రాజీనామా చేయమంటారా?" అసహనం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ కూడా ఇంచుమించు అదేతరహాలో ప్రజాపథకం కార్యక్రమంలో మాట్లాడారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఢిల్లీలో వున్నారు. అధిష్టానం ప్రతినిధిగా హైదరాబాద్ విచ్చేసిన వాయలార్ రవి ముఖ్యమంత్రి లేకుండానే ఇతర నేతలతో సంప్రదింపులు జరపడం ఇందుకు నిదర్శన౦గా భావిస్తునారు. అయితే కొంతమంది నేతల మాత్రం వాయలార్ రవి తెలంగాణ అంశంపై చర్చించడానికి విచ్చేశారని బావిస్తుండగా మరికొంత మంది మాత్రం 18 నియోజకవర్గాలలో జరగనున్న ఉప ఎన్నికలు నేపథ్యంలో వచ్చారని బావిస్తున్నారు. తెలంగాణా విషయమైనా, ఉప ఎన్నికలపై ఎత్తుగడల వంటి అంశాలు మాట్లాడానికి ముఖ్యమంత్రి లేని సమయాన్ని ఎందుకు ఎంచుకొంటారనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు. ఆ కారణంగానే ముఖ్యమంత్రి మార్పు వార్తకు బలం చేకూరుతుంది.