ఇటు కాంగ్రెస్ అటు తెరాస మధ్యలో లెఫ్ట్ ..అదీ స్టొరీ
posted on Sep 19, 2022 @ 3:42PM
మునుగోడు ఉపఎన్నికలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు,( సిపిఐ,సిపిఎం) అధికార తెరాసకు మద్దతు ప్రకటించాయి. ఈ పొత్తు ఉప ఎన్నిక వరకే అని, కమ్యూనిస్ట్ నేతలు ముందుగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. బీజీపీ ముక్త భారత్ లక్ష్య సాధన కోసం, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వరకూ తెరాసతో పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు.
అందుకోసమే, అదే పవిత్ర ఆశయంతో కమ్యూనిస్టులతో చేతుల కలుపుతున్నట్లు గులాబీ బాస్, ముఖ్యంత్రి కేసీఆర్ కూడా స్పష్టం చేశారు. అలాగే, ఈ బంధం శాశ్వతం అని కూడా ప్రకటించారు. ఆ విధంగా మునుగోడు ఉప ఎన్నిక వరకే పరిమిత అనుకున్న తెరాస, కమ్యూనిస్ట్ పార్టీల ప్రేమ బంధం, మూడు ముళ్ళు వేసుకుంది. అంటే, మునుగుడు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, చివరి వరకు ఉభయ కమూనిస్ట్ పార్టీలు, తెరాసతో కలిసి సాగాలనే నిర్ణయానికి వచ్చాయి. అదలా ఉంటే తాజాగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బీజేపీని నిలువరించేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని హైదరాబాద్ గడ్డపై నుంచే పిలుపు నిచ్చారు.
అంతే కాదు, బీజేపీ వ్యతిరేక కూటమి కాంగ్రెస్ తో కలిసే పోరాటం చేస్తుందని ఏచూరి స్పష్టం చేశారు. అంతకు ముందే మునుగోడు సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా, ప్రగతి శీల, లౌకిక వాద శక్తులన్నీ ఏకం కావాలని పిలుపు నిచ్చారు. సిపిఐ నేతలు కూడా తెరాసతో ఎందు కోసం చేతులు కలిపినా, బీజేపీని ఓడించే ‘పవిత్ర’ ఆశయం తోనే, గులాబీ గూటికి చేరామని ప్రకటించారు. అలాగే, అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలలో కేరళ, మిళనాడు, బీహార్, తెలంగాణ సహా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరినీ ఆహ్వానిస్తున్నారు.
ముఖ్యమంత్రులతో పాటుగా, ఇతర పార్టీల ముఖ్యనేతలు కూడా అక్టోబర్ 16 న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని సిపిఐ నేతలు ప్రకటించారు.అంటే ఒక విధంగా, బీజేపీ యేతర శక్తుల ఐక్య వేదికకు సిపిఐ జాతీయ మహాసభలు వేదిక కానున్నాయి. నిజానికి ఈ పరిణామాలుమ, ఈ ప్రకటనలు ఒకదానికొకటి సంబంధం లేనట్లు, కనిపించినా అంతర్లీనంగా చూస్తే, రాష్ట్రాలలో ఎలా ఉన్నా, జతీయ స్థాయిలో, ఒక్క కాషాయం మినహా మిగిలిన అన్ని రంగులలదీ ఒకటే గమ్యం , ఒకటే దారి, అనే విషయం క్లియర్ కట్ గా స్పష్ట మవుతోంది. అలాగే, మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా, బీజేపీ వ్యతిరేకత విషయంలో మాత్రం కమ్యూనిస్టుల చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు. అలాగే, కాంగ్రెస్, కమ్యూనిస్టుల స్నేహ బంధం గురించి కూడా ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కరలేదు.
ఎప్పుడో, నెహ్రూ హయాంలో కృష్ణమీనన్ తో మొదలైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల స్నేహ బంధం, ఈ రోజుకూ అలా సాగుతూనే వుంది. నిజానికి, ఈ రోజుకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్క కేరళ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ తో ఎదో ఒక విధమైన చెలిమిని కొనసాగిస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలోనూ సిపిఎం, కాంగ్రెస్ కలిసే పోటీ చేశాయి. సో... కమ్యూనిస్టులతో చెలిమి అంటే, కాంగ్రెస్ తో చేయి కలిపినేట్లేనని వేరే చెప్పనక్కర లేదు. నిజానికి కమ్యూనిస్టుల పౌరోహిత్యంలో కాంగ్రెస్, తెరాస మధ్య,అసెంబ్లీ ఎన్నికలకు ముందే పొత్తు తధ్యమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నిజానికి, మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్, తెరాస ఒక అవగాహనతో ఉన్నాయని అందుకే, అభ్యర్ధి విషయంలో తెరాస ఆచితూచి అడుగులు వేస్తోందని అంటున్నారు.