పొడుస్తున్న పొత్తు.. కాంగ్రెస్, తెరాస జట్టు!
posted on Sep 7, 2022 @ 3:01PM
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగే భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఆ యాత్ర సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో ఇంతవరకు నిప్పూ ఉప్పులా ఉన్న కాంగ్రెస్, తెరాస జోడీ జోడో యాత్ర అయితే మొదలైంది. తెలంగాణ రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయా? జాతీయ రాజకీయాల బాటలోనే రాష్ట్ర రాజకీయాలు అడుగులు వేస్తున్నాయా? కాంగ్రెస్, తెరాస చేతులు కలిపెందుకు సిద్దమవుతున్నాయా? అంటే, ఇటు కాంగ్రెస్, అటు తెరాస నాయకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.
అవును, జాతీయ స్థాయిలో బీజీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, తెలంగాణలోనూ బీజేపీ వ్యతిరేక పార్టీలు, ఒక్కటై జట్టు కట్టేందుకు సిద్దమవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక మాటున, బీజేపీ వ్యతిరేకత వంకన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికే, తెరాసతో జట్టు కట్టాయి. ప్రగతి భవన్ పంచన చేరాయి. సరే, అదే మంత పెద్ద విషయం కాదు. నిరర్ధక ఆస్తులు ఏ ఖాతాలో కలిసినా, వామ పక్ష పార్టీలు ఎవరితో కలిసినా ఒక్కటే, అనే అభిప్రాయం వామపక్ష మేతావులే వల్లే వేస్తున్నారు. ఒక అంకెకు ‘లెఫ్ట్’న (ఎడం వైపు) ఎన్ని సున్నాలు చేరినా, ఆ అంకె విలువ పెరగదు. సో.. లెఫ్ట్ పార్టీలు ఎవరితో చేతులు కలిపాయి అనేది పెద్దగా పట్టించుకోవలసిన విషయం కాదు.
కానీ, తెరాస నాయకత్వం కాంగ్రెస్ పార్టీతోనూ జట్టు కట్టేందుకు సిద్దంగా ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, చీటికీ మాటికీ ఢిల్లీ వెళ్లి వచ్చేది కూడా అందుకోసమే అంటున్నారు. అదలా ఉంటే ఇంతకాలం, తెరాస, బీజేపీ తోడూ దొంగలని ప్రచారం చేయడంలో ముందున్న పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మీడియా ‘సాక్షి’ గా కేసీఆర్ కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు తహతహ లాడుతున్నారని చెప్పు కొచ్చారు. అయితే, కాంగ్రెస్ తో కలిసేందుకు కేసీఆర్ సిద్దంగా ఉన్నా, తెరాసతో చేయి కలిపేందుకు హస్తం పార్టీ సిద్దంగా లేదని ఆయన చెప్పు కొచ్చారనుకోండి అది వేరే విషయం.అయినా, కీడెంచి మేలెంచాలని అనుకున్నారో ఏమో కానీ, ఢిల్లీలో కేసీఆర్ పలుకుబడి బాగా పెరిగిందని, చెప్పు కొచ్చారు.
నిజానికి, అద్దంకి దయాకర కంటే ముందే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఒకప్పుడు రాహుల్ గాంధీకి గురువుగా రాజకీయ పాఠాలు బోధించిన దిగ్విజయ్ సింగ్ ఇంకో అడుగు ముందు కేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే తెరాసని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అప్పట్లో కేసీఆర్ ఇచ్చిన మాటను గుర్తు చేశారు. అంతే కాదు, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడైనా, బీజేపీ వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ తో కలిసి రావచ్చు కదా, అని కేసీఆర్ కు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. ఒక విధంగా రెడ్ కార్పెట్ పరిచారు. ఆయన ఇంకా చాల విషయాలు చెప్పినా, కేసీఆర్ వస్తానంటే వద్దనే పరిస్థితి లేదని, అయన మాటలను బట్టి అర్ధం అవుతోంది.
మరో వంక తెరాస ఎమ్మెల్యే బొల్లం ఎల్లయ్య యాదవ్ దేశంలో రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకం కావలసిన అవసరం ఉందని, ముఖ్యమత్రి కేసీఆర్ అదే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. అంతే కాదు, కేసీఆర్ నచ్చినా నచ్చక పోయినా, దేశ ప్రయోజనాల దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీ తెరాసతో చేతులు కలపాలని, ఒక విధమైన వినయ పూర్వక డిమాండ్ చేశారు. అలాగే, బీజేపీ విధానాలను వ్యతిరేకించే ప్రజలు కాంగ్రెస్ పార్టీకు పట్టం కడతారనే భ్రమల్లో ఆపార్టీ నాయకులు ఉంటే అది వారి ఇష్టమని, అదే జరిగితే ఉత్తర ప్రదేశ్ ఫలితాలే దేశంలోనూ పునరావృతం అవుతాయని, తెరాస ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చురకలు అంటించారు. సూచన ప్రాయంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.
మొత్తానికి, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు తెరాస, తెరాసతో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సూత్ర ప్రాయంగా అంగీకరించి నట్లే కనిపిస్తోంది. అంతేకాదు, మునుగోడు ఉప ఎన్నికలకు ముందే, కాంగ్రెస్, తెరాసల మధ్య పొత్తు పొడిచినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. అదలా ఉంటే, బీజేపీ నాయకత్వం జరుగుతున పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది.
నిజానికి, ఇది అనూహ్య పరిణామంగా కనిపించినా, అనూహ్య పరిణామం కాదని, బీజేపీ నాయకులు అంటున్నారు. జాతీయ స్థాయిలో జరుగతున్న ప్రయత్నాలే,తెలంగాణలోనూ జరుగుతాయని, కాంగ్రెస్, తెరాస, ఎంఐఎం లెఫ్ట్ పార్టీ కూటమి ఏర్పడుతుందని. బీజేపీ నాయకత్వం ముందుగానే పసికట్టిందని, అంటున్నారు. కాగా, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక వైపు మిగిలిన పార్టీలు అన్నీ ఒక వైపు ఉంటాయని అనేక సందర్భాలలో టీవీ చర్చల్లో ప్రకటించారు.ఇప్పుడు అదే జరిగే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.