ఖమ్మంలో క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్!
posted on Dec 3, 2023 9:12AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా బాగానే పోటీ ఇస్తోంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని, పదికి పది స్థానాలు తామే గెలుస్తామని హస్తం పార్టీ ముందునుంచి చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతల చేరికతో కాంగ్రెస్ మరింత బలంగా తయారైంది. అసలే ఖమ్మంలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయనకు తోడు పొంగులేటి, తుమ్మల తోడు కావడంతో.. ఖమ్మంలో క్లీన్ స్వీప్ పట్ల కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది.
ఖమ్మలో పది స్థానాలు ఉండగా, ఈ ఎన్నికల్లో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ పోటీ చేసింది. కొత్తగూడెంలో మాత్రం కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ పోటీ చేసింది. ఇప్పుడు ఈ పది స్థానాల్లోనూ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తే, కాంగ్రెస్ చెప్పినట్టుగానే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.