ఎమ్మెల్యేగా ఓటమి దిశగా కేసీఆర్.. 40 ఏళ్ళ తర్వాత మొదటి షాక్!
posted on Dec 3, 2023 8:45AM
కేసీఆర్ వరుసగా మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ ఎంతో నమ్మకంగా ఉంది. అయితే మూడోసారి సీఎం అవ్వడమేమో కానీ, పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్క చోట ఎమ్మెల్యేగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేశారు. దీంతో గజ్వేల్ లో ఓటమి భయంతోనే గులాబీ బాస్ కామారెడ్డి బరిలో నిలిచారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కామారెడ్డిలో కేసీఆర్ ఖంగుతినే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు మొదలయ్యాక ప్రస్తుత ట్రెండ్ ని గమనిస్తే నిజంగానే కామారెడ్డిలో కేసీఆర్ కి షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తోంది.
కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి ఆధిక్యత ప్రదర్శించగా, ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలయ్యాక కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి లీడ్ లోకి వచ్చారు. ఇదే ట్రెండ్ కొనసాగితే కామారెడ్డిలో కేసీఆర్ కి ఓటమి తప్పదు.
ఒకవేళ కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతే, 40 ఏళ్ళ తర్వాత ఇది ఆయనకు ఎమ్మెల్యేగా మొదటి ఓటమి అవుతుంది. మొదటిసారి 1983 లో సిద్ధిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బీఆర్ఎస్ అధినేత.. ఆ తర్వాత సాధారణ, ఉప ఎన్నికలు కలిపి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా ప్రతిసారి జయకేతనం ఎగురవేశారు. అలాంటి కేసీఆర్ 40 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేగా ఓటమిని చూడబోతున్నారు అనిపిస్తోంది.