పాలడుగు వ్యాఖ్యలు సరైనవేనా?
posted on Nov 1, 2012 @ 6:09PM
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు ఆచి తూచి మాట్లాడతారని చాలామందికి ఓ నమ్మకం. హుందాగా రాజకీయం నడపడం పాలడుగు ప్రత్యేకతని చాలామంది చెప్పుకుంటారుకూడా.. ఎప్పుడూ కాంట్రవర్సీల జోలికిపోయినట్టుకూడా కనిపించిన బాపతు కానే కాదు. కానీ ఉన్నట్టుండి ఆయనో బాంబు పేల్చి కలకలం రేపారు.
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న నేతలంతా నిజాయతీ లేనోళ్లే అంటూ పాలడుగు చేసిన కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చాలామందికి మింగుడుపడలేదు. కొందరైతే ఔరా.. ఏంటీ పెద్దాయన ఇలా మాట్లాడ్డం మొదలెట్టాడు అని ముక్కున వేలేసుకున్నారుకూడా.. ముందుగా ఈ మాటనాలనుకున్న చాలామంది రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెచ్చుకుని వెనకడుగువేశారు. పాలడుగు మాత్రం వీరోచితంగా చెప్పదలచుకున్న నాలుగు ముక్కలూ బైటపెట్టేశారు.
ఐదేళ్లపాటు పాలించమని ప్రజలు అధికారం కట్టబెడితే, నేతలు ప్రలోభాలకు లోనై సొంతపార్టీల్ని వైఎస్సాఆర్ కాంగ్రెస్ కోసం త్యాగం చేస్తున్నాయంటూ పాలడుగు పదునైన విమర్శలు చేశారు. కిందటి ఎన్నికల్లో.. నీతి, నిజాయతీ లేనివాళ్లకు టిక్కెట్లివ్వడంవల్లే ఇప్పుడిలిం పరిస్థితి తలెత్తిందని ఆయనకు నిశ్చితాభిప్రాయం.
రాజకీయాల్లో విలువలు అంతరించిపోతున్నాయని కామెంట్ చేసిన పాలడుగు.. వైకాపాలో చేరిన నేతలంతా ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన రోజు త్వరలోనే వస్తుందంటూ జోస్యం చెబుతున్నారు. నిజానికి వై.ఎస్ కుటుంబంతో పాలడుగుకి బీరకాయ పీచు చుట్టురికంకూడా ఉంది. కానీ.. తిట్టిపోయడానికి బంధుత్వం అడ్డురాకూడదన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమయ్యింది.