దారి మార్చుకున్న కారు



కారు తీరు మారుతోంది. రోజులతరబడి ఢిల్లీలో మకాం వేసి ప్రత్యేక రాష్ట్రంకోసం లాబీయింగే చేశారో లేక ప్రత్యర్ధులు ఆరోపించినట్టుగా సొంతపనులే చూసుకున్నారో తెలీదుగానీ.. డ్రైవర్ పోస్ట్ లో ఉన్న కేసీఆర్ లో మాత్రం చాలా మార్పు కనిపిస్తోంది. పూర్తిగా మట్టి కరుచుకు పోయిన పార్టీకి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు కేసీఆర్ గట్టి ఏర్పాట్లే చేసుకుంటున్నారు.

 

 

అయినవాళ్లనీ, కానివాళ్లనీ, కనిపించినవాళ్లందరినీ కారులో ఎక్కించేసుకుని కలుపుపోయి బలప్రదర్శన చేయాలన్న ఆలోచన ఇప్పుడు కేసీఆర్ మైండ్ ని తెగ తొలిచేస్తోంది. అందుకే చిన్న నేతల్నైనా సరే కలిసి తీరాలన్న పట్టుదలతో సారున్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయ్.

 

పక్క పార్టీల్లో కనిపిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన పెద్ద నేతలే ఇప్పుడు టార్గెట్. ఎలాగైనా వలవేసి వాళ్లని ఒడిసిపట్టుకుని, పార్టీలోకి లాగేయాలన్న తలంపుతో బొబ్బిలి దొరవారు గట్టిగా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. పక్కా ప్లాన్ తో ముందుకెల్తే తప్ప పని కాదని నిర్ణయించుకున్న కేసీఆర్ అందుబాటులో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించి చూస్తున్నారట.

 

పరిగి టిడిపి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిని ఆల్రెడీ లైన్ లో పెట్టేశారు. నాగం జనార్దన్ రెడ్డిని, వేణుగోపాలాచారిని మెల్లగా దువ్వి లోపలికి లాక్కునేందుకు గట్టి ప్రయత్నమే జరుగుతోంది. తనకున్న వశీకరణ శక్తులన్నింటినీ ప్రయోగించి, ఇకపై అసలు తెలంగాణలో మరో పార్టీయే లేదనిపించేందుకు దొరవారు అహరహం శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది.  అసలు మరో పార్టీయే లేకపోతే అంతా మనదేకదా.. అన్న సూత్రాన్ని అందరికీ నూరిపోస్తున్నారటకూడా.