‘సదస్సు’ లో తెలంగాణా ఉంటుందా ?
posted on Dec 14, 2012 @ 11:59AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే మార్గాలను చర్చించడానికి, పార్టీని బలోపేతం చేసే విధానాలను ఖరారు చేయడానికి ఈ నెల 16 న హైదరాబాద్ లో జరుప తలపెట్టిన కాంగ్రెస్ సదస్సులో తెలంగాణా అంశాన్ని ప్రస్తావించక తప్పదని ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
మరో వైపు, ఈ సదస్సులో తెలంగాణా పేరు రాకుండా చూసేందుకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణా నేతలను ఒప్పించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు.
ప్రత్యెక రాష్ట్ర అంశం తమకు అత్యంత ముఖ్యమని, ఈ అంశాన్ని అన్ని కీలక వేదికల ఫైన లేవనెత్తుతామని తెలంగాణా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ విషయంలో బొత్స ఆంక్షలు సరి కాదని వారు అంటున్నారు. ఈ విషయం ఫై చర్చ జరపడానికి ఎం పి లు పాల్వాయి, మంద జగన్నాధం, వివేక్, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి, ఆనంద భాస్కర్ నిన్న సమావేశమయ్యారు.
ఈ అంశంపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేవలం బొత్స చెప్పినంత మాత్రాన నేతలు తెలంగాణా అంశాన్ని ప్రస్తావించకుండా ఉంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. వారిని బొత్స అడ్డుకోగలరా? దీనికి సమాధానం చెప్పడం మాత్రం అంత తేలిక కాదు.