గుజరాత్ లో రికార్డ్ స్థాయి పోలింగ్: మోడి హాట్రిక్ ఖాయమా?
posted on Dec 14, 2012 @ 10:02AM
గుజరాత్ లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత పోలింగ్ లో ఓటర్లు రికార్డ్ స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో గుజరాత్ లో మొత్తం మీద 59 శాతమే పోలింగ్ నమోదు కాగా, ఈ సారి రికార్డ్ స్థాయిలో తొలి విడతలోనే 68 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికల్లో వరుసగా మూడోసారి మోడి హాట్రిక్ సాధించడం ఖాయమని అన్ని సర్వేలు చెప్తున్నప్పటికి, ఆయన ప్రాభవానికి గండికొట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు, మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ స్థాపించిన గుజరాత్ పరివర్తన్ పార్టీ సౌరాష్టల్రోని అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాయి.
సౌరాష్ట్ర ప్రాంతంపై మోడి పట్టు కోల్పోవచ్చనే అంచనాలు ఆయన విజయోత్సాహంపై నీళ్లు చల్లుతోంది. గురువారం పోలింగ్ జరిగిన 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 52 స్థానాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. 2007 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మోడీ నేతృత్వంలోని బిజెపికి 38 స్థానాలు లభించాయి. అయితే ఈసారి ఎన్నికల్లో అదే స్థాయిలో విజయం సాధించే అవకాశాలు కనిపించడం లేదు.
కేశుభాయ్ పటేల్ స్థాపించిన గుజరాత్ పరివర్తన్ పార్టీ సౌరాష్టల్రోని తొలి విడత పోలింగ్ లో అధిక స్థానాలు గెలుచుకుంటామని ధీమాగా ఉంది. సౌరాష్ట్ర రీజన్ లో మెజార్టీ స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేశుభాయ్ పటేల్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో బిజెపి కి నూకలు చేల్లినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. అయితే కేశుభాయ్ పటేల్ తన కమ్యూనిటీ ఓట్లను ఎంత వరకూ ఆకట్టు కుంటారనేది అంతిమ ఫలితాలలో తేలనుంది.