అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందట
posted on May 23, 2014 @ 1:04PM
కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజన వ్యవహారంలో మొండిగా ముందుకు పయనించాలనుకొన్నపుడే, కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలు నిశ్చయించుకొన్నారు. అంటే సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందే దాని ఓటమి ఖరారు అయిపోయింది. ఆ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి చాలా స్పష్టంగా తెలిసిఉన్నప్పటికీ, జగన్, కేసీఆర్ ల భరోసా చూసుకొని ఎన్నికలకు వెళ్లి భంగపడింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా సీమాంద్రాలో ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్నపుడయినా అది మేల్కొని ఉండి ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయం చవిచూసేదే కాదు.
రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ సీమాంద్రాలో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో కనీసం రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టే అర్హత కూడా కోల్పోయింది. పదేళ్ళు రాష్ట్రాన్నిఏకఛత్రాదిపత్యంగా పరిపాలించిన కాంగ్రెస్ నేతలకు ఇది ఘోర అవమానమే. కాంగ్రెస్ అధిష్టానం తన ప్రత్యర్ధుల కోసం తవ్విన గోతుల్లో తనే పడింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు, ఇప్పుడు డిల్లీ నుండి గల్లీ వరకు గల కాంగ్రెస్ నేతలందరూ కూడా తమ పార్టీ ఓటమికి గల కారణాలు స్పష్టంగా కళ్ళెదుట కనబడుతున్నపటికీ, తమకు ఇబ్బంది కలిగించని కొత్త కారణాలను కనుగొనేందుకు నడుం బిగించారు.
సీమాంద్రాకు సంబంధించినంత వరకు రాష్ట్ర విభజన వ్యవహరమే కాంగ్రెస్ కొంప ముంచిన సంగతి అందరికీ తెలుసు. అయితే దానిని బహిరంగంగా ఒప్పుకోవడానికి నేటికీ వారు సిద్దంగా లేరు. అందుకే తమ ఓటమికి మరో కొత్త కారణం కనిపెట్టారు. ఎక్కడో హైదరాబాదులో పార్టీ ప్రధాన కార్యాలయం ఉండటం వలన సీమాంధ్ర ప్రజలకు దూరమయ్యామని, అందుకే ఎన్నికలలో ఓడిపోయామని కొందరు కాంగ్రెస్ నేతలు ఒక కొత్త కారణం కనుగొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా వారితో ఏకీభవిస్తూ, త్వరలో కొత్త రాజధానికి స్థలం గుర్తించగానే అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకొంటామని తెలిపారు. అయితే ఇంత కాలంగా హైదరాబాదులో పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో విజయం సాధిస్తూనే ఉందనే సంగతి వారు విస్మరించారు.
రాష్ట్ర విభజన, కాంగ్రెస్ అసమర్ధ అవినీతి పాలన కారణంగానే ప్రజలు పార్టీని తిరస్కరించారనే సంగతి కాంగ్రెస్ నేతలందరికీ బాగా తెలిసి ఉన్నప్పటికీ, పార్టీ కార్యాలయం హైదరాబాదులో ఉన్నందునే ఎన్నికలలో ఓడిపోయామని చెప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే. కాంగ్రెస్ నేతలు కనీసం ఇప్పటికయినా దైర్యంగా ఆత్మవిమర్శ చేసుకొని, లోపాలను సరిదిద్దుకోకుండా ఇటువంటి కుంటి సాకులతో పొద్దుపుచ్చడం చూస్తే వీరిక ఈ జన్మలో మారరని అర్ధమవుతుంది.