కాంగ్రెస్, లోక్‌సత్తా... ఇదీ మీ సత్తా
posted on Feb 17, 2015 @ 2:33PM
తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఫలితం వెలువడింది. సాధారణంగా ఏ ఎన్నిక జరిగినా ఫలితం ఎలా వుంటుందా అనే ఆసక్తి అందరిలోనూ వుంటుంది. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మాత్రం ఎవరికీ అంతటి ఆసక్తి లేదు.. ఉత్కంఠ అంతకన్నా లేదు. ఎందుకంటే, ఈ స్థానం నుంచి దివంగత ఎమ్మెల్యే వెంకట రమణ భార్య, టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ విజయం సాధిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి. తిరుపతి ఓటర్లకు కూడా ఈ విషయం తెలుసు. అందుకే చాలామంది ఓటు వేయడానికే వెళ్ళలేదు. 50 శాతం ఓట్లే అక్కడ పోలయ్యాయి. ఎలాగూ గెలిచేది సుగుణమ్మే... ఆమాత్రం దానికి మనం శ్రమపడి పోలింగ్ స్టేషన్‌కి వెళ్ళడం ఎందుకు అని అనుకుని వుంటారు. 50 శాతం పోలింగే జరిగినా సుగుణమ్మకు 1,16,524 ఓట్ల మెజారిటీ వచ్చింది. పోలింగ్ ఇంకా ఉద్ధృతంగా జరిగి వుంటే ఆమె మెజారిటీ రెండున్నర లక్షలు దాటిపోయి వుండేది. సరే, సుగుణమ్మ గెలుపుతో తిరుపతి ఎన్నికల హడావిడి ముగిసింది. కానీ, ఇప్పుడు ప్రారంభం కావలసింది కాంగ్రెస్, లోక్‌సత్తా పార్టీల్లో అంతర్మథనం.
సంప్రదాయం ప్రకారం తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం కావలసి వుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో సమాధిలో పడివున్న కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఏదో ఆశ. సమాధిలోంచి పైకి లేచి మళ్ళీ ఏపీ జనాలను పీడించలన్న పేరాశ... ప్రేతాశ. అందుకే తిరుపతిలో పోటీ చేయాలని గాఠ్ఠిగా డిసైడైంది. ఇక జనాల్లో వాల్యూ ఏనాడో పోగొట్టుకున్న లోక్‌సత్తా కూడా ఠాఠ్ మేం పోటీలో నిలుస్తాం.. మేం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని స్టేట్‌మెంట్ పారేసి పోటీలో నిలిచింది. ఈ రెండు పార్టీలు రంగంలో వున్నాయి కాబట్టి మేమూ రంగంలో వున్నామంటూ కొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ఫలితం.... ఏకగ్రీవం కాకుండా ఎన్నిక జరపడం వల్ల ప్రజాధనం ఖర్చయింది. కాకపోతే, కాంగ్రెస్ పార్టీ, లోక్‌సత్తా పార్టీ మరోసారి అంతర్మథనం చెందే అవకాశం వచ్చింది.
ఈ మాట అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫీలవుతారేమో... అయినా పర్లేదు... వాస్తవం అనక తప్పదు.. ఆ వాస్తవం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలక అసహ్యం, రోత, చీదర... ఇలాంటి పదాలు ఇంకా ఏవైనా వుంటే అవన్నీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని గానీ, ఆ పార్టీ నాయకుల ముఖాలను గానీ చూడ్డానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టపడటం లేదు. తమకు ఏపీలో ఎంతమాత్రం విలువలేదని తెలిసినా ఇంకా ఏదో బావుకుందామని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తే జాలి వేయడం కాదు.. చిరాకు పుడుతోంది. దీనికితోడు తిరుపతిలో రిగ్గింగ్ చేయడం వల్లే తెలుగుదేశం పార్టీ గెలిచిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి స్టేట్‌మెంట్ ఒకటీ... ఏమయ్యా పెద్దమనీషీ... మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఇంకా ఎంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో పూలు పెట్టాలని అనుకుంటున్నారు? మీరు స్వర్గానికి వెళ్ళి అమృతభాండం పట్టుకొచ్చినా అందులో విషం వుందనే ఏపీ ప్రజలు భావిస్తారు. ప్రజల్ని నమ్మించడానికి మీరు కాస్త తాగి చూపించినా నమ్మరు... అదీ ఏపీలో మీ పార్టీ పరిస్థితి... అందువల్ల ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ సన్యాసం పుచ్చుకుని ఇళ్ళలో కూర్చుని, సంపాదించిన ఆస్తులు లెక్కపెట్టుకుంటూ టైంపాస్ చేస్తే మంచిది.
ఇక లోక్‌సత్తా... ఈ పార్టీకి ఎక్కడా ఒక్క కౌన్సిలర్ కూడా లేడు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడే గెలిచే సత్తా లేక చతికిలపడ్డాడు. అదీ ఈ పార్టీకున్న ప్రజాబలం. ఇలాంటి పార్టీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ కంకణం కట్టుకుందట. వారసత్వ రాజకీయాలను ఎదిరించదలచుకుంటే ప్రజలు వ్యతిరేకిస్తారు... మధ్యలో లోక్‌సత్తా ఎవరు? తనకుమాలిన ధర్మాన్ని పట్టుకుని తిరుపతి ఎన్నికల బరిలో నిలిచింది కాబట్టే లోక్‌సత్తాకీ ప్రజలు బుద్ధి చెప్పారు. అధికారపార్టీ మీద ఎంత దుమ్మెత్తి పోసినా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు తొమ్మిది వేల చిల్లర. లోక్‌సత్తాకి వచ్చిన ఓట్లు మూడు వేల చిల్లర... ఈ రెండు పార్టీలూ ఇలా ఏపీలో చిల్లర కోసం పాకులాడకుండా సైలెంట్‌గా వుంటే బెటర్.